పుట:కవికర్ణరసాయనము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

జంభశాసనపురమణిసాలచక్ర, మండలీకృతనిజభోగకుండలీశ
ముచ్యమానవినూత్ననిర్మోకయష్టి, యచ్చరల కంతఁ జూపట్టె నభ్రగంగ.

69


చ.

కనకమయాంబుజప్రసవగంధము లానియు బిందుపంక్తిచే
ననయము దొప్పఁదోఁగియును నభ్రసరిత్సవనంబు లప్సరాం
గనలముఖాబ్జసౌరభము ఘర్మజలంబులుఁ గ్రోలెఁ గ్రొత్త లై
ఘనతరలాభముం గలుగఁ గైకొనరే ధర నెంతతృప్తులున్?

70


తే.

కూడి జలదేవతలు మమ్ముఁ గూడవచ్చి, ఇంత చక్కనివారంచు నెపుడు వెఱఁగు
దనుక మిన్నేఁటఁ దమనీడఁ దార చూచి, ముచ్చటలఁ బొంది రప్సరోముగ్ధ లపుడు.

71


చ.

త్రిదళతరంగిణిం గడచి తీవ్రతమై దిగి వచ్చి దేవతా
సుదతులయూర్పుఁ దానిచవిచోఁకున వెంటన వచ్చెఁ దేంట్లు త
ద్వదనసనాభివర్గము నవశ్యతఁ జంపఁగఁ బంపు పూని య
న్నదికమలాధిదేవతల వచ్చిననెయ్యురు వచ్చిరో యనన్.

72


ఉ.

వచ్చువిమానపంక్తులజవంబున జల్లున మున్ను పాయ గా
చినవారివాహములు వెండియు వెంటన రాఁ దొణంగె న
య్యచ్చరపిండుఁ జూచి తమ రప్పుడు వాయుట నాత్మకీయవి
ద్యుచ్చయశంకమై తగిలి తోడనె కుయ్యిడుమాడ్కి మ్రోయుచున్.

73


ఉ.

మందసమీరణక్రియల మార్గపరిశ్రమశాంతిగాఁ బయో
బిందువిముక్తి నింపుమదిఁ బెంపుచు నీడలు వేయఁ దోయభృ
ద్బృందమునందు మెల్లనిగతిం జనఁగా నియమించి రప్డు సం
క్రందనవారకామినులు కామగ మైనవిమానసంఘమున్.

74


చ.

పొదిగొనుచూడ్కుల న్మెఱచి పోనిమెఱుంగులు గా నిగుడ్చుచుం
జెదరనిభూషణప్రభల జిష్ణుధనుశ్శతకోటిఁ బన్నుచుం
ద్రిదశపురీవిలాసినులు జిల్లమిగా జనియింపఁ జేసి రం
బుదముల కెల్ల న ట్లొకయపూర్వమనోజ్ఞవిలాససంపదల్.

75


తే.

అద్రిశృంగము లనుశంక నధిగమింపఁ, గోరియునుబోలె బలుమాఱు వారిధరము
లాత్మపావనంబుచేత నయ్యమరసతుల, పయ్యదలు దూల్చి కుచములు బయలుపఱిచె.

76


చ.

తపమునకుం గుశాసనము దానపువిత్తు ఫలించుపాదు ని
క్కపుసుఖసిద్ధి గోరి వెదకం దగునాకర మబ్జజాదివి
ష్టపముల కెల్ల సంబళ మొసంగెడుపాలెము మర్త్య మంత వే
లుపువెలమచ్చెకంట్లకును లోచనగోచర మయ్యె దవ్వులన్.

77


వ.

తదనంతరంబ.

78