పుట:కవికర్ణరసాయనము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఇట్టిమిముగుఱించి హీనకార్యం బైన, మాకుఁ బ్రళయ మనుచు మగువలార!
భయ మొనర్చెఁ గానఁ బనిచెద నొక్కకా, ర్యమున కరుగవలయు నదియు వినుఁడు.

57


వ.

మహీమండలంబున నయోధ్యాప్రాంతంబునం దమసాసరయూమధ్యంబున మాంధాతృ
మహీవరాగ్రణి యుగ్రతపం బొనరించుచు నున్నవాఁడు. అతనినిష్ఠకు నంతరాయంబు
ఘటియించి రండు పొం డని సంభావించి గంధర్వులం గాపుగాఁ జన నియమించి
వీడ్కొలిపిన.

58


తే.

ప్రమదమునఁ బొంగి పాణిపద్మములు మొగిచి, యేగుదెంచుసుపర్వపర్వేందుముఖుల
విభునికంటె నపూర్వభూవిహరణేచ్ఛ, లపుడు పురికొల్పె విజయప్రయాణమునకు.

59


క.

సురరమణీజనవిద్యు, త్స్ఫురణావిర్భావమునకు సూచక మగుచున్
మొరసెం దత్ప్రాస్థానిక, మురజధ్వనిగర్జ లఖిలమోహనభంగిన్.

60


తే.

స్తనితగతశంఖమర్దళధ్వానమునకు, నుబ్బి పురివిచ్చి యాడుమయూరశిశువు
కడప దిగకుండి యానవిఘ్నము ఘటించెఁ, బయనమై వచ్చు నొకమరుత్పద్మముఖికి.

61


ఉ.

వల్లభుహస్త మూఁది సురవారవిలాసిని యోర్తు వచ్చి శో
భిల్లువిమాన మెక్కి మణిభిత్తిపయిం దననీడ దోఁచుటం
బల్లవధూర్తు మున్నుగ సపత్ని నయించితె యంచుఁ గిన్పునం
బల్లవితాక్షి యై దిగియె భావమునం బరితాప మెక్కఁగన్.

62


క.

కొలికిఁ దగుల్బమి నొక్కతె, మొలనూలు పదాబ్జములకు మొరయుచు జాఱెన్
ఫలియింపదు పయనం బిది, వల దనుచుం గాళ్లఁ బెనఁగువైఖరి దోఁపన్.

63


క.

ఉర్వీస్థలిపై వేడ్క న, పూర్వవిహారములు సలుపఁబోయెడుతమి లోఁ
బర్వగఁ శకునము దలఁపక, గర్వంబున వెడలి రమరకాంతాజనముల్.

64


తే.

అబ్జభవుపట్టి కంతరాయంబు గొలుప, వెడలి రచ్చర లవ్వేళ వేల్పుఁబ్రోలు
ఘనతదీయతపస్సమాకర్షణమున, వైంద్రవిభవాధిదేవత లరుగుమాడ్కి.

65


తే.

వాసవునివీటివారవిలాసవతులు, తీవ్రభానునిఁ గదియ నేతెంచి రంత
నతనిఁ జొరఁగోరి యమవస యందుదాఁకఁ, గ్రమ్మి చనుదెంచుబహుచంద్రకళలువోలె.

66


క.

సరికడచి వచ్చునపు డ, చ్చరపిండు వెలింగె మున్ను సంపూర్ణసుధా
కరమండలమును బోలెన్, ఖరకరబింబమున నేఁడు గలిగెద రనఁగన్.

67


తే.

పాసి చనుటకు నోర్వ కచ్చరలు నిలుప, వేఁడి పట్టంగ నిగిడించువిధము దోఁప
భానుకరసంచయము తద్విమానరత్న, కాంతిసంయుక్తిదీర్ఘమై కాన నయ్యె.

68


సీ.

బలిదాతృదానసంభవకీర్తిలేఖిక, మురదైత్యభిత్పదాంబుజమధూళి
విధికమండలుపయోనిధిసుధారసధార, జగదండఖండకచ్ఛత్రయష్టి
మదనభేదనశిరోమందారమాలిక, సగరసంజీవనౌషధిమతల్లి
కనకాద్రిదండసంకలితకేతనశాటి, హారినభోంతరహారలతిక