పుట:కవికర్ణరసాయనము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఉల్లము వే ఱైనమరు, ద్వల్లభుఁ గని రంభ యపుడు దప్పక రామా
పల్లవకరముఖవీణా, వేల్లితతానప్రతానవినిమయఫణితిన్.

48


ఉ.

దేవ! సురాధినాథ! భవదీయమనోబ్జమునందు వింతగా
విధి జింతిలంగఁ గత మెయ్యది? నేఁడు తపోనిమి త్త మెం
దేవెడవార్త గల్గెనొ యదేనిఁ దపోధనశుద్ధచిత్తము
క్తావలి గ్రువ్వఁగా గుణము లౌట యెఱుంగవె మత్కటాక్షముల్?

49


సీ.

పంచాగ్నిశిఖలచేఁ బరితపింపనివారి, విరహాగ్నిశిఖలచే వేఁచి విడుతు
వర్షాంబుధారల పడిఁ గలంగనివారి, మోహదృగ్ధారల ముంచి కలఁతు
మంచుచిల్కుటకు రోమాంచ మొందనివారి, ననుపు పుట్టింతు లేనవ్వు చిలికి
సతతోపవాసు లై చవులు డించినవారిఁ, దవులింతు నధరామృతంబుచవులఁ


గీ.

గాదు లక్ష్యంబు నాకు లోకత్రయంబు, పలుక నేటికి బడుగుతాపసులకధలు?
నన్నుఁ జూడక నాపేరు విన్న మాత్రఁ, బల్లవింపవె రాతిరూపంబు లైన.

50


తే.

కార్య మెఱిఁగినఁ దీర్చియ కాక నీదు, సన్నిధికి వత్తుమే మేము జంభమథన!
యింక నైనను బంపు మమ్మింతనుండి, మృగ్య మగుఁ గాని జగతి వైరాగ్యపదము.

51


చ.

అన విని సంతసించి త్రిదశాగ్రణి లోనికలంకు దేఱి యా
నన మెగయించి మించి చిఱునవ్వు దొలంకెడుసాదరావలో
కనములఁ జూచుచుం బలికెఁ గామిను లిందఱు మీ రమోఘసా
ధనములు గల్గి నాకుఁ గలదా మదిలో నణువంత వంతయున్?

52


క.

పోలించి చూడ నఖిలో, త్తాలం బగునాకనామదైవతలక్ష్మీ
లీలాసౌధము నిలిపిన, మూలస్తంభములు గారె? ముద్దియలారా!

53


తే.

అద్రిపక్షాభిహతిమాత్ర కశని గాని, యహహ! ప్రతిపక్షపక్షాభిహతికి నెల్ల
సంతతము మాకు నమ్మినసాధనంబు, చలితభవదీయవీక్షణాంచలము గాదె?

54


ఉ.

ఆరసిచూడ వేదములయట్ల మనంబునఁ దోఁచి యున్నశృం
గారరసాధిదేవతలఁ గంజవిలోచనలార! మిమ్ముఁ బెం
పార సృజించెఁ గాక తనయంతన యేని గణింప నెట్టు లం
భోరుహసూతి మీభువనమోహనరూపవిలాససంపదల్?

55


ఉ.

గట్టిగ నిట్టిచోట ధృతికంకటముల్ విదళింప నేర్చు మీ
యట్టియమోఘసాధనములందుబఁ గాక జగత్త్రయీజయం
బెట్టు ఘటించు మన్మథున? కింతయు నిక్కువ మిట్లు గానిచోఁ
బట్టినఁ గందుపువ్వు లొకబాణములే యలశంబరారికిన్.

56