పుట:కవికర్ణరసాయనము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్ఫూర్తి వహించు నిట్లు బలసూదన తావకలక్ష్మి తత్తప
స్ఫూర్తికి మెచ్చి తాన చనఁ బూని పదం బిడి యున్నదో సుమీ!

38


తే.

అసమసింహాసనస్థుఁ డై యఖిలరాజ్య
వైభవంబులు గైకొంచు వఱలువాఁడు
నియతిమై గాలి గ్రోలెడు నేఁడు నహహ!
యధిప! యతఁడు మహాభోగియగుట నిజము.

39


ఆ.

కోర్కి వ్రేఁకమునను గులశైలమునుఁ బోలె, నిశ్చలత నతండు నిలిచెఁ గాక
భృశతపంబువలనఁ గృశుఁ డతం డొకమంద, పవనుచేతఁ నెగసి పాఱఁ డెట్లు?

40


ఉ.

శి ష్టగునత్తపస్విజనశేఖరుఁ డుగ్రతపంబు చేఁ బద
భ్రష్టునిఁ జేయఁగాఁ దలఁచి బ్రహ్మహరాదులలోన నొక్కయు
త్కృష్టునిమీఁదఁ దాను జగతిం గలవైరము గొంట యెల్ల వి
స్పష్టము గాన లేదు మృగజాతివిరోధము తద్వనంబునన్.

41


క.

ఏల పలుమాట? లనిమిషపాలక ! యెల్లింట నేఁట ఫలియించుఁ దదు
త్తాలతపఃకల్పకమున, రాలెడువడపిందె నీదురాజ్యం బనఁగన్.

42


తే.

ఖచరవర! చెప్పితిమి నీకుఁ గన్నతెఱఁగు, చిత్తగించి ప్రతిక్రియ సేయు మిఫుడ
యనుచు వీడ్కొని నారదుం డరుగుటయును, డెందమునఁ జాలఁగలఁగి పురందరుండు.

43

ఇంద్రుఁడు మాంధాతృతపంబుఁ జెరుప నచ్చరలం బంపుట

క.

మంత్రుల దిక్పాలుర నయ, తంత్రజ్ఞులఁ బిలిచి కూడి తానున్ వారున్
మంత్రపరు లై తదీయని, యంత్రంబునఁ బిలువఁ బనిచె నపు డచ్చరలన్.

44


సీ.

విధివత్సమాపితవివిధయజ్ఞఫలంబు, లుంకువ యైనయేణాంకముఖులు
పటుసంగరాంగణప్రాణదానంబులు, రోవెల యైనమెఱుంగుఁబోండ్లు
నిరుపమతమతపఃపరమపుణ్యంబులు, కట్టడ యైనశృంగారవతులు
కల్పోక్తతీవ్రనైకవ్రతాచరణముల్, మూల్యంబు లైనయంబుజవదనలు


గీ.

పట్టుఁగొమ్మలు రమణీయభావములకు, జన్మభూములు తారుణ్యసంపదలకుఁ
బ్రాప్యదేశంబు లతులాభిరూప్యములకు, వచ్చి రచ్చర లనిమిషస్వామికడకు.

45


ఉ.

పంకరుహాయతాక్షులు త్రపావినయంబుల ఱెప్పపాటునం
బొంకము చూపుచూపుగమిఁ బూజ యొనర్చుచు బాహుమూలదీ
ప్త్యంకురహేమనిష్కనిచయంబు లుపాయన మిచ్చి కంకణ
క్రేంకృతు లుల్లసిల్లఁగ మొగిడ్చిరి చేతులు దేవభర్తకున్.

46


ఆ.

జంభరిపుకొల్వు రంభాదిసతులచేతఁ, బంచసాయకసాయకప్రాయ మయ్యె
వారిఁ గనుఁగొన దిక్పాలవరులమనము, పంచసాయకసాయకప్రాయ మయ్యె.

47