పుట:కవికర్ణరసాయనము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెంతయు ధూళి యై విరిసి యీగతిఁ దూలె నొకో యనంగ హే
మంతమహోదయంబున హిమంబు తమంబుగ ముంచె లోకమున్.

26


క.

కలయ జగ మెల్ల ముంచిన, బలు వగునమ్మంచులోన భావింపఁబడున్
వెలుగులఱేఁ డొకవేళ, న్వలిపపుఁదెరలోనిదర్పణంబును బోలెన్.

27


క.

దీపితముక్తాహారముఁ, బాఁపినదోషంబు తలఁపువాఱినఁ బశ్చా
త్తాపమున నొక్కొ సతులకుఁ, బాపటముత్తియము లయ్యెఁ బ్రాలేయంబుల్.

28


క.

వలువ దొలంగుట కుల్కుచుఁ, బులకలు పుంఖానుపుంఖముగ భీతి మదిం
దలకొనఁ ద్రిలోకి వడపడఁ, జలియించెన్ శిశిరనూత్నసంగమవేళన్.

29


క.

చెప్ప నశక్యం బగుచలి, యుప్పతిలం బాలవృద్ధయువజనములకుం
దప్పక శరణము లయ్యెం, గుప్పసములు ముర్మురములు గుచకుంభములున్.

30


ఆ.

అట్టిశీతవేళయందుఁ గుత్తుకబంటి, నీటఁ దపము చేసె నిష్ఠ నతఁడు
నిజతపోగ్నివలన నిఖిలలోకము శీత, భావ మెఱుఁగ కాత్మఁ బరితపింప.

31

నారఁదుడు మాంధాతృతపశ్చరణము నింద్రుని కెఱిఁగించుట

తే.

ఇట్లు దప మాచరింప మహేంద్రుఁ డున్న
కొలువునకు నేగి కయ్యపుఁగూటితపసి
యతఁడు గావించుపూజన మంది కలదు
చింతనం బొండు వలయు నేకాంత మనిన.

32


క.

ఏకత మని వినిపింపఁగ, నేకతమో? యనుచు సంళయించుచు వేవే
పాకారి కొల్వు వీడ్కొని, యేకాంతమునందు నతని నే? మని యడుగన్.

33


క.

ఓయమరేశ్వర! యిట ము, న్నేయుగములఁ గనియు వినియు నెఱుఁగము వినుమో
హో! యిదె మాంధాతృమహీ, నాయకుఁ డుగ్రముగఁ దప మొనర్సఁగఁ గంటిన్.

34


అతులయోగసమాధిచే నత్తపస్వి, నిశ్చలుం డని వేఱ వర్ణింప నేల
యతనిఁ గనుఁగొన్నయంత నత్యద్భుతముగ, నిశ్చలుం డెంతవాఁ డైన నిర్జరేంద్ర!

35


తే.

తలఁపులోపలికోర్కి తీవలు ఫలింప, మొదలఁ దగఁ బల్లవించినమురువుచూపు
సంతతస్నాననియమైకశాలి యతని, పాటలాంశుజటాచ్ఛటాప్రాంచలములు.

36


ఉ.

హెచ్చుతపోగ్ని యప్పు డపు డీనెడుపిల్లలువోలె నల్గడం
జిచ్చు లెలర్ప నుంగుటము చేతన నిల్చి ఖరాంశుమూర్తిపై
వెచ్చనివేళఁ బ్రత్యహము విచ్చి తనర్చుట గాని మోడ్పమిన్
నిచ్చయ మమ్మహామహుని నేత్రము లబ్జము లౌట వాసవా!

37


ఉ.

కర్తవు గాన నిక్కముగఁ గన్నతెఱం గెఱిఁగింతు నీకు సా
ర్వర్తుకపుష్పసంపదల రంజిలుతద్వనపాటి నందన