పుట:కవికర్ణరసాయనము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

సరసీపునఃపునస్సలిలఖేలనముల, సరసగైరికపటాచ్ఛాదనముల
సహిమాంబుఘనసారచందనచర్చలఁ, దారహారావళిధారణముల
యంత్రధారాగృహాభ్యంతరక్రీడల, శశికాంతశయ్యాంతసంవసతుల
సంతతకరతాళవృంతవీజనముల, చిరసాంద్రచంద్రికాసేవనముల


గీ.

స్వాదుఖర్జూరనారికేళాదివివిధ, సారపానకరససుధాస్వాదనముల
హితసమీహితగతులఁ జయించి రవుడు, దంపతు లమోఘనైదాఘతాపభరము.

8


ఉ.

అట్టినిదాఘవేళ నిబిడాగ్నులు నల్దశలందుఁ బర్వఁగాఁ
గట్టిగ నేల యంగుళ మొకండ ఘటించి ఖరాంశుమూర్తిపైఁ
బెట్టినచూడ్కితో హృదయపీఠికయం దమృతాబ్ధిమందిరున్
బట్టము గట్టి దుస్సహతపం బొనరించె జగంబు బెగ్గిలన్.

9

వర్షర్తువర్ణనము

ఉ.

దీపిత మయ్యె నంతట నదీనవయౌవన మంబుజాననా
కోపకవాటనిర్ఘటనకుంచిక చాతకనిర్జలవ్రతో
ద్యాపన మబ్జినీవికసనాస్తమయంబు మయూరనర్తనా
టోపనిధోపదేశకనటుండు పయోదసమాగమం బిలన్.

10


ఉ.

చాతకభాగ్యరేఖ జలజాతపరిచ్యుతి పక్వకందళీ
సూతిచికిత్సకాంగన ప్రసూనశరాసన రాజ్యలక్ష్మి ప్ర
జ్యోతనచంద్రమఃపటువిధుంతుదభీషక సర్వజీవజీ
వాతువు గాన నయ్యె నవవారిధరోదయవేళ యంతటన్.

11


మ.

విరహిస్వాంతమనోజపానకశిఖావిర్భూతధూమంబులం
బరకాసారగతాసితోత్పలకలాపంబుల్ జగన్మండపో
పరినీలాచ్ఛవితానచేలములు దృష్యద్గ్రీష్మనిర్వాసణో
ద్ధురవర్షాగమరాజభద్రకరు లుద్ఘోషించె నూత్నాభ్రముల్.

12


ఉ.

వచ్చె ఘనాఘనంబు లివె వల్లభు లేలొకొ రా రటంచు వి
ద్యుచ్చలనోద్యతద్యుతుల కుల్కుచుఁ ద్రోవలు నిక్కి చూచి
పుచ్చక నెవ్వగ న్వగపు పుట్టఁగఁ బాంధసతు ల్నిగుడ్చుపె
న్వెచ్చనియూర్చుల న్విరిసె మిన్నుపయిం బ్రథమాంబువాహముల్.

13


క.

నీరం బప్పుడు నూతులఁ, బూరించె నటంచు నేల పొగడగఁ? నాక్రొ
క్కారుతఱి బాష్పవర్షము, పూరించెం బాంథకర్ణపుటకూపములన్.

14


సీ.

కేళీనటద్గేహకేకికేకారవో, న్మేషంబు చెవులఁ దేనియలు చిలక
నభినవార్జితగర్జితారవోల్లసనంబు, లిఱియుఁగౌఁగిటిబిగి నినుమడింప