పుట:కవికర్ణరసాయనము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము



రంగధరాధిప శృం
గారరసాధీశభావ గరుడగమన సం
స్మేరముఖాంబుజమధురా
కారాలంకృత నమజ్జగజ్జనహృదయా.

1

మాంధాత తపంబు సేయుట

వ.

ఇ ట్లమ్మహీవరశ్రేష్ఠుండు నిష్ఠురతపోనిష్ఠుం డై.

2


చ.

పరువడిఁ గందమూలఫలపర్ణజలంబులఁ గొన్నికొన్ని వ
త్సరములు వోవఁ గాఁ బిదప సర్వము మాని నిజాంతరంబునన్
హరి భజియించి శేషసవనాశనభర్తయుఁ బోలె నాతఁడున్
గరువలిఁ గ్రోలఁ జొచ్చెఁ ద్రిజగంబులు విస్మయ మొంద నయ్యెడన్.

3

గ్రీష్మర్తువర్ణనము

క.

అతనిసమగ్రం బగుతీ, వ్రతపోగ్ని జగంబు నిండ వడిఁ బర్వినసం
గతి దుస్సహోష్ణసంప, ద్వితతం బై యంతలోన వేసవి వచ్చెన్.

4


ఆ.

తాపతప్తజంతుతతుల విశ్వంభర, గర్భమున భరింపఁ గరుణఁ దలఁచి
తెఱపి యిచ్చె ననఁగఁ దీవ్రాతపాహతి, నేల నెల్ల గాఁడి నెఱియ లొదవె.

5


సీ.

ఏకార్ణవంబులో నిర వైనపటపత్ర, శయనంబు మదిఁ గోరి శార్ఙ్గపాణి
యష్టమూర్తులలోన నంబురూపము నాత్మఁ, గాంక్షించి హరిణాంకఖండమాళి
ప్రథమాంబుజఘ్రాణభావస్థితియ వేఁడి, యభిలషించెఁ బయోరుహాసనుండు.
వేడ్క గా కుండియు విలయోదకోదర, స్థితి యపేక్షించె ధాత్రీవధూటి


గీ.

హేమరజతాచలాదిమహీధరములు, హిమగిరిత్వంబు మతుల నూహించుకొనియె
సకలలోకానివార్యదుస్సహమహోష్ణ, భీష్మగతి యైన యమ్మహాగ్రీష్మవేళ.

6


క.

ఆమనిరాజ్యం బెడలుట, గాముఁడు నెల వేది యున్నఁ గ్రమ్మఱ గ్రీష్మం
బాముక్తహారతోరణ, భామాకుచమండలముఁ బట్టము గట్టెన్.

7