పుట:కవికర్ణరసాయనము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గడపటఁ బ్రాణ మన్న సుఖగౌరవ మన్నను దైవ మన్న నే
డ్గడయు ధనంబ తత్త్వ మనఁగా విను మర్మమ పొమ్ము లోభికిన్.

129


తే.

చంద్రసూర్యాగ్నిరుచులచే సడలిపోని, యట్టిమోహంపుటిర్లచే నంధు లగుచు
సౌఖ్యమార్గంబు గానక సకలజనులుఁ, గూలుదురు మాతృగర్భాంధకూపతతుల.

130


క.

మును గలిగియు రూపఱినం, గనియును విషయముల మఱియుఁ గాంక్షించు నిహీ!
యనుభవముమీఁద నెఱుఁగని, మనుజాధము మోహ మొరులమాటల విడునే?

131


తే.

మరలకుండుట యెఱిఁగియు మఱవలేరు, విడక పోరామి యెఱిఁగియు విడువలేరు
కానిపని యౌటల యెఱిఁగియు మానఁ జాల, రద్భుతము గాదె మోహాంధు లైననరులు?

132


ఉ.

మేరువుఁ బూరిగాఁ దలఁచు మి న్నఱచేతన మూయఁ బైకొనున్
నీరధిఁ బుక్కిలింతునను నిర్జరనాధుఁడ నేన పొ మ్మనున్
ధారుణి పెల్లగింతు ననుఁ దా నొకమానవకీట మైన ని
వ్వారలు మాన్ప లే రిది ధ్రువంబు మదం బనుసన్నిపాతమున్.

133


చ.

గురువులకంటెఁ జుల్కనయుఁ గ్రూరతకంటె హితంబు దుర్జనో
త్కరములకంటెఁ జుట్టలు వృథాకలహంబులకంటెఁ గృత్యముల్
దురితముకంటె మేలు పరదూషణవృత్తముకంటె వేడ్కయున్
ధరఁ దమకంబుకంటె మఱి ధన్యత గల్గదు మర్త్యకోటికిన్.

134


క.

ఇచ్చెద నను సర్వస్వముఁ, జొచ్చెద నను మర్త్యుఁ డెదిరి సౌద యైనఁ దుదిన్
జచ్చెద నను వెడపనికై, మచ్చరమునకంటెఁ గీడు మఱియుం గలదే?

135


క.

అనుభోక్త ద న్నెఱుంగం, డనుభవకారయిత వార్త యైనను నెఱుఁగం
డనుభావ్యతత్త్వ మెఱుఁగం, డనుభవమే కాని బద్ధుఁ డంధుఁడ కాఁడే?

136


చ.

విడుపఁడు సౌఖ్యము న్మఱచి వేమఱు నంకుశబాధ నెమ్మిఁ గో
రెడు నగపడ్డ సింధురమురీతి ఫలోత్కటబంధనంబు మా
నెడుదెఱ నేర్పరించుకొని నేరక యింద్రియపంచకంబుచే
నుడుగనికోర్కిఁ దీర్చుకొనుచుండుట మేలుగఁ జూచు జీవుఁడున్.

137


మ.

ప్రతిదేహప్రళయంబు నందనతనుబంధానుసంబంధుఁ డై
ప్రతినైమిత్తికమున్ జతుర్ముఖశరీరస్తబ్ధుఁ డై ప్రాకృత
ప్రతికల్పాంతమునం బరాత్మతను నిర్మగ్నాత్ముఁ డై యాలయ
త్రితయంబందు నరుండు వీడఁ డచిదాప్తిం గ్రమ్మఱం బుట్టుచున్.

138


తే.

ఇట్టి సంసారబంధంబు హేయ మగుటఁ, గనియు వినియు విరక్తుండు గాక మఱియుఁ
గోరి పొందు నరుండు తత్కారణం బ, నాదికర్మప్రవాహంబు మేదినీశ!

139