పుట:కవికర్ణరసాయనము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభాతవర్ణనము

క.

ఏకతపుమతకముల నా, నాకరణాసననిరూఢి నటియించుమదో
త్సేకమిధునంబులకుఁ గృక, వాకుస్వర మంత భరతవాక్యం బయ్యెన్.

182


తే.

ధవళకిరణుండు చరమదిక్తటమువెంట, నల్లనల్లనఁ దిగజాఱె వెల్ల నగుచు
సురతపరవశఖేచరీవిరళచికుర, భారమున జాఱువాఱుపూబంతివోలె.

183


చ.

దలమఱిపోవువెన్నెలవిధం బది రక్తపటీరచర్చగాఁ
జులకనితారకావళి విసూత్రితహరమణివ్రజంబుగా
నలతొలుసంజకెంపు పదయావకచిహ్నలు గాఁగ నంబర
స్థలి యలరారె వేకువ నిశాశశిభుక్తవిముక్తశయ్య నాన్.

184


తే.

వేగునంతకు విటవిటీవివిధసురత, బంధబంధురగతులు తత్పరతఁ జూచి
మెచ్చి తలలూఁచునట్లు కంపింపఁ జొచ్చె, వేగుఁబోకటగృహదీపికాగణంబు.

185


ఆ.

దశలు తుదకు వచ్చి తల లల్ల నల్లన, వణఁకవణఁక నపుడు వార్ధకంబు
తేటపడు విభాతదీపంబులకు మేనఁ, బలిత మనఁగ వెల్లఁబాటు తోఁచె.

186


చ.

వలిగొను మంచునం దడిని వారిజినీకలికాపుటీకుటీ
బిలములు దూఱి తేనియలవెల్లువఁ దోఁగుచు వచ్చి యంతటన్
దలిమము లుజ్జగించుమిథునంబులయందు వియోగవహ్నిఁ గా
ల్కొలిపెఁ చదూష్మలం బొరలఁ గోరియుఁబోలె విభాతవాతముల్.

187


చ.

నయమున సూతగీతులు వినం బడ హారము లింపు సూప వీ
డియములు క్రొత్త లై తగఁ బటగ్రహణత్వరమాణవల్లభా
వయవములందుఁ జూడ్కు లొదవ న్నునుగాడ్పులు సోడుముట్ట నిం
ద్రియములపండు వయ్యెను సతీపతికోటికి వేగుఁబోకటన్.

188


చ.

చిడిముడితోడఁ జేల మొకచేఁ గటిమండలిమీఁదఁ జేర్చుచున్
వెడవెడ జారునిం గనలి వేనలిఁ దత్కరమూలకాంతి వీ
డ్వడఁ బెరకేల నిల్పుచును వాడుఁ గనుంగవ సోల శయ్యపైఁ
బడఁతులు లేచుసంభ్రమము భర్తల నువ్విళు లూర్చెఁ గ్రమ్మఱన్.

189


ఆ.

దించి సురతవేళ దిగఁ దన్ని విడిచిన, పగఁ బటంబు లంతఁ బద్మముఖులు
తత్పతలము డిగుచుఁ దముఁ దార తిగిచిన, విటులవెనుకఁ జొచ్చి వెడలకుండె.

190


చ.

అలసతచేఁ ద్రపాగమసమాకులభావముచేత నైనయ
వ్వలువలపిండు వాయఁ గని వారక మీవలరాచవేడ్కలన్
మెలఁగెడువేళ వీడ్వడిన మీ కిది యుక్తమె? యంచు హాసముల్
సలిపిరి గేలిపెట్టుచును జంపతులం జెలిపిండు వేకువన్.

191