పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజ్ఞాశాలి. ఈశ్వరసృష్టిరహస్యమును స్పష్టముగ గ్రహించినప్రతిభావంతుఁడు. "రవి గాననిచోఁ గవి గాంచునేకదా” అను నార్యోక్తి యిట వ్యక్తమయ్యె. రస మీమనీషివృషభునిచే మహాహర్షదాయకము గఁ బోషింపఁబడి పొంగిపొరలుచుండును. ప్రపంచమందలిమానవప్రకృతి యీ కవితయందుఁ బ్రతిఫలించును.

'కళాపూర్ణోదయము' నందు సర్వరసములు విశేషభాసురభాతిఁ బరిపోషితము లయ్యె. పరమరమణీయము లగువర్ణనలతో సొంపారుచున్నది. ఇందు ముఖ్యమైనది శృంగారరసము. అయిన నది యెంతమాత్ర మతివేల మన వీలులేదు. 'కళాపూర్ణోదయము,’ ‘ప్రభావతీ ప్రద్యుమ్నము' హృదయాహ్లాదకరము లైనప్రబంధరత్నములు. చదువరులడెందముల సమ్మోదసుఖాంబుధి నోలలాడించుచుండును వీనిం జదువఁ జదువఁ జవులూరుచుండును.

ఈ కవికులతిలకుని చతురకవితావిలాసము గణనాతీత మై రసోచితశయ్యతో నతిశయిల్లుచున్నది. ఎన్నితడవుఁ దిలకించినను దనివి తీఱదు దీనం గలుగునమందానంద మనవద్య మై యనుభవైకవేద్య మైనది. ఇట్టిసుప్రశస్తప్రబంధములు గలయాంధ్రభాష ధన్యాతిధన్యము. ఆంధ్రుల మైనమనము కృతార్థులము. ఈసత్కావ్యములరసాస్వాదన మొనర్చి బహులాభములఁ బొంది తరింతుము గాక! సూరనార్యకవీశ్వరా! గౌరవపురస్సరములును ననేకములు నైననానమోవాకములు కైకొనుము.

రావు వేంకటకుమారమహీపతిసూర్యారావు