పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మృదుమధుర పదగుంఫితము. సాధుజాతీయదేశీయపదతేజోవిరాజితము. అనర్గళధారాశుద్ధి గలదై శోభిల్లుచుండును. సరససారస్వతాంశప్రశస్తితోఁ బ్రకాశించును. శబ్దార్థాలంకారసంకలిత మై కలకలలాడుచుండును. వ్యర్థపదకళంకరహిత మైనది. తేటతెనుఁగుమాటలతోఁ దేజరిల్లుచుండును. పలుకుపలుకునకుఁ దేనియ లొలుకును. రసపోషణమునకు మిగుల బాగుగఁ దగినయంద మైనపదములపొందికయు, వృత్తములవరుసయుఁ గలిగి వెలుఁగొందుచుండును. వేఱువేఱురసములు వర్ణించు నపుడు భిన్నభిన్నభంగులపలుకులకూర్పును బద్యములపోకడలును నొప్పారుచుండును. సాధారణముగ మనము నాడుచుండుసాధుప్రయోగములతో నిండి కరము రమ్యముగ నుండును. మొత్తముమీఁద ద్రాక్షాపాకము. ఇందు సుప్ర్రసాదశక్తి యసదృశము. శ్లేష యటనటఁ గాననగు. దాని నాయాపట్టులఁ గవియే సూచన చేయుచుండును. ఈ కవితల్లజుఁడు చిత్రవిచిత్రము లైనపోకడలఁ బోయె. ఆపూర్వానల్పకల్పనాజల్పితములఁ జేసె. అత్యంతచమత్కారము లైనరచనలచాతుర్యముఁ గనఁబఱిచె. ఈమహనీయునిభావనాశక్తి మిక్కిలి సంభావితము. ఈతనికవితను విశేషవిస్మయావహములును సముదీర్ణములు నైనసహజవర్ణనలు సంపూర్ణరసభరితము లై భాసిల్లును. వర్ణనావైదగ్ధ్య మమితాశ్చర్యకర మై రాణించును. వర్ణితాంశము మనకనులకట్టెదుటఁ బటము గట్టినట్టు కన్పట్టును. ఎవ రెచట నేయేపట్టుల నెటులు వచింపవలయునో చరింపవలయునో యనువిషయములు చక్కనియౌచిత్యముతోఁ బాటింపఁబడెను. ఇక్కవి మానుషప్రకృతి కూలంకషముగఁ దెలిసికొనిన శేముషీవిభవాభిశోభితుఁడు. లోకజ్ఞానసంపన్నుఁ డైన