పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దెనుఁగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదిసంబాల్యవ
ర్ణన లేమిం బరితుష్టి నా కవి యొనర్సం జాల వత్యంతమున్".

ఇదు వచింపఁబడినవానిలో 'రాఘవపాండవీయము', 'కళాపూర్ణోదయము', 'ప్రభావతీప్రద్యుమ్న' మనుమూఁడుప్రబంధరత్నములు మాత్రము మనకు లభించు భాగ్యము గలిగినది. తదితరగ్రంథములు దురదృష్టవశమున మనకు దొరకలేదు.

ఈగ్రంథత్రయమునందు మొదటి దైన 'రాఘవపాండవీయము' ద్వ్యర్థిప్రబంధము ద్వ్యర్థి యైన నర్ధము సులభముగ బోధపడును. రామాయణభారతగాథలలో దేనిని మనము మనమున నుంచి చదువుదుమో దానికిఁ దగినయర్థము తేలికగాఁ దెలియును. ఇట్టిపుస్తకమునుంగూడ రసవంతముగ రచించినాఁడు. ఇది మిక్కిలి కష్ట మైనపని దీనిని సరిబోలుద్వ్యర్థికావ్యము వేఱొకటి లే దని వచింపవచ్చు. రెండవది యగు 'కళాపూర్ణోదయము' స్వకపోలకల్పితము. అనిర్వచనీయరచనాసమంచిత మైన కావ్యరత్నము. మూఁడవదియగు 'ప్రభావతీప్రద్యుమ్నము' పురాణకథ యైనను నూతనరీతులు గలిగి రమణీయము లగు వర్ణనలతో విరాజిల్లుచున్నది. అతిలలితశైలీవిలసితము. ఇది మిగుల మనోహర మగు మహాకావ్యము.

కవిత్వతత్త్వ మీతీరున నుండఁదగు నని సూరనార్యుఁడు తనకావ్యములలో నీలీల నిర్వచించె.

సీ.

“శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగనీక
                   పదమైత్రి యర్థసంపదలఁ బొదలఁ
దలఁపెల్ల నక్లిష్టతను బ్రదీపితము గాఁ
                   బునరుక్తిదోషంబుపొంతఁ బోక