పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బడినది. అఖండపండితుఁడు, అనేకగ్రంథావలోకనకుశలుఁడు, వివిధదేశభాషాకోవిదుఁడును, రసగ్రహణపారీణుఁడును, కవిశిఖామణియు నైనకృష్ణదేవరాయభూపాగ్రణి

ఆ.

“తెలుఁ గదేల యన్న దేశంబు తెలుఁ గేను
దెలుఁగువల్లభుండఁ దెలుఁ గొకండ
యెల్లనృపులుఁ గొలువ నెఱుఁగవే బాసాడి
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.”

అని దీనిని మెచ్చినాఁడు. కొండొకపురాతనకవీంద్రుఁ డైన వినుకొండ వల్లభరాయఁడో లేక శ్రీనాథుఁడో రచియించిన క్రీడాభిరామమునందు

ఆ.

"జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చుటాఁడుబిడ్డ మేలు గాదె"

అని దేశభాషలందుఁ దెనుఁగు లెస్స యనియే కాక సంస్కృతముకంటెఁ గూడ నుత్కృష్టమైన దనియు వచింపఁబడినది. ఈభంగిని మనభాషాప్రాశస్త్యము ప్రశంసింపఁబడియె. ఇట్లు మహత్తరముగ భాసిల్లు మనభాషయం దనేకసత్కావ్యములు వెలయుచున్నవి. వీనిలో నెల్ల నుత్తమోత్తమము లైన సుప్రశస్తప్రబంధములు కొన్ని గలవు. వీనిని మించిన చెలువము గల రచనలు ప్రపంచమునం దెందును గోచరింపవు. ప్రభావతీపద్యుమ్న, కళాపూర్ణోదయ, ప్రబంధరాజము లీగ్రంథరాజి