పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

తా నేమో మంత్రమును జపించుచుండెను. అప్పు డందఱును వరుసగా వచ్చి బియ్యము పళ్లెములోఁ బోసిరి. వెంటనే యతఁడుంగరమును దీసిన వాఁడీతఁడని చూపెను. అప్పుడక్కడనున్నవారందఱును నద్భుతరసాక్రాంతులయిరి. రాజశేఖరుఁడుగారును అతఁడు మహామంత్రవేత్త యని యొప్పుకొని నమస్కారము చేసి, పోయిన నగ యాతని మంత్రశక్తిచేత వచ్చునను నమ్మకముతో మధ్యాహ్నమునఁ దప్పక రావలయు నని పలుమారు ప్రార్ధించి తీసుకొని రమ్మని సిద్దాంతితోను జెప్పెను. సిద్దాంతియు శాస్త్రులును ముఖవిలాసముతో సల్లాపసుఖము ననుభవించుకొనుచు నింటికి నడచిరి. ఇక్కడకు వచ్చున్నప్పుడే సిద్దాంతియు శాస్త్రియు రహస్యముగా నన్ని సంగతులను మాటాడుకొని రాజశేఖరుఁడుగా రిచ్చుబహుమతిలో చెఱిసగమును బుచ్చుకొనునట్లు సమాధానపడిరి. కాఁబట్టి రాజశేఖరుఁడు గారికి నమ్మకము పుట్టించుట కయి ముందుగా చేయవలసిన తంతును కూడఁబలుకుకొన్న తరువాత, వస్తువును దాచినవాఁడు పళ్ళెములో బియ్యము పోయఁగానే వెనుకఁ దాను బోసెదననియు వాఁడే దానిని తీసి దాచినాఁడని చెప్పవలసిన దనియు సిద్దాంతి యింటివద్దనే నిర్ణయము చేసినందున శాస్త్రు లాతని సాహాయ్యము చేత నిమిషములో నుంగరమును దీసిన వానిని చూపఁగలిగెను. మధ్యాహ్నాభోజనము చేసి బయలుదేరి కావలసిన పరికరములతో సిద్దాంతియు హరిశాస్త్రులును వచ్చి రాజశేఖరుడు గారి యిల్లు చేరిరి. అంతకు మునుపే యింటగల పరిచారకులను తక్కిన వారును రావింపబడిరి. హరిశాస్త్రులకు వినబడినట్లుగా సిద్ధాంతి రధోత్సవ సమయమున రుక్మిణితో నెవరు వెళ్ళిరో కాసుల పేరు పోయినప్పు డెవ్వరెవ్వరెచట నుండొరో యా సంగతులు వెంట వెళ్లినవారి నడిగి తెలుసుకొను చుండెను. అంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాస్త్రుల చెవులో నొక