తృతీయా శ్వాసము
క. కాఁపుల కెల్లను నేమము
లేపట్టునఁ గొఱఁతవడక యెలమి యొసంగన్
గాపాడుచు నందఱు నొక
రూపునఁ జూచుచు యుధిష్ఠిరుం డరసెఁబజన్.
తే. ఇట్లు కొన్నాళ్లు నేలను నేలుచుండి
డెందమూఱటఁ జెందక కుందుచుండఁ
గలఁకవోఁ గృష్ణుఁగనిపాడిగఱపవేఁడ
నతఁడు కొనిపోయె భీష్ముని యండకతని.
ఉ. తమ్ముల వెంటఁగొం చరిగి తాతనుగన్గొని ఱేఁడు మ్రొక్కఁదా
నమ్ములపాంపునందు వెతలందుచు నుండియు వెన్నుమన్ననన్
నెమ్మదిఁ జెంది మన్మలకు నెట్టన దీవెనలిచ్చి యోలిమై
నిమ్ములఁ దెల్పెఁబాఁడికత లిట్లని భీష్ముఁడు భీము నన్నకున్.
క. కాఁపుల నొప్పింపక తా
నేపట్టున రవ్వపడక యెల్లరు మెచ్చం
గాఁపులవలనను బన్నుల
నోపికతోఁ గొనఁగ వలయు నొడయం డెవుడున్.
క. పుడమిఁ దనకంటె బలియునిఁ
దొడరిన నెగ్గగును గాన దొరయగువాఁడా
యొడయనితోడను బొందే
యొడఁగూర్పఁగవలయుఁజాల నుపమయొసంగన్.
క. దండుల నని లేనవుడును,
మెండుగ నుంచుకొను చెవుడు మెలఁ కువతోఁ దా
నుండంగావలె నెకిమీఁ,
డొండు దొరతనంపువింత లొప్పుగఁగనుచున్.