పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/698

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము


కురువేళ్ల పందిళ్లు కొమరొప్ప చేయించి
సరిగంచుచందువాల్ జతనుపఱిచి
నెత్తావిగల పూచుటెత్తులు గట్టించి
యగరువత్తులతావి పొగలువెట్టి
 ప్రోలు గై సేసి రంతటఁబొలువుమీఱ
వెన్నుడును దమ్ములిల్లాలు వెంటరాఁగఁ
బుడమివేల్పులు దీవెన లిడుచునడవ
వేడ్కతో యుధిష్ఠిరుఁడల్లవీడు సొచ్చె.

క. చివురుంబోఁడులు మేడల
చివరల నందముగ నిల్చి చేతులనిండం
బువులుగురియంగ దొరయును
దవుమాడ్కిని దెరువుదాఁటి దఱిసెం గొలువున్.

క. ముత్తైదువలు నివాళుల
న త్తఱిఁ బాటలను బాడి యలరుచు నియ్యం
జొత్తెంచెఁ గొలువుఁ గూటము
తత్తరమునఁ గొంతికొడుకు తద్దయు నెలమిన్.

తే. వెదకి యవ్వీటిజోస్యులు వెట్టినట్టి
మంచిమూర్తంబునందును మించువేడ్క
దొరతనంబును బూనెను సరసనున్న
తనను లొక్కటదీవింపఁదనరి ఱేఁడు.

ఉ. అమ్మెయిఁ బూనఁ దెమ్మెరలు నల్లనఁ బల్మఱు వీచె చేలుపుం
గొమ్ములు క్రుమ్మరించి రొగిఁ గ్రొన్ననమొత్తము నేలవేల్పు లొ
క్కుమ్మడి సేనఁబ్రాలు పయి నూరక చల్లిరి కాఁపు లెల్లరున్
నెమ్మదులందు నంతసము నిల్పి రతం డటు నేలఁ దాల్చుటన్.