పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

గీ.నాగవల్లియు లోనుగా నడచినంత
బెండ్లినాడులు గడువంగ బేర్మితోడ
నాలుమగలను గలువంగ నపుడుతలచి
మేటివేడుక నాలవనాటిరేయి.

సీ.కమ్మతావులుగ్రమ్ము కవురంపువిడెములు
పసిడిపళ్ళెరముల బొసగనుంచి
కస్తురి జవ్వాజి గందంబు బన్నీరు
రతనంపుగిండుల రమణనుంచి
పటికంపుగోడల పజ్జనిర్వంకల
నిలువుటద్దంబులు నెలవుకొలిపి
పగడంపునునుగోళ్ళ పచ్చలపీట పై
వట్టివేళ్ళసురటి పెట్టియుంచి
వెండితబుకులబండ్లు వేర్వేరపెట్టి
గొప్పరతనంపుదివ్వెలు కుదురుపఱిచి
మేలిచొక్కవు బంగారుమేడలోని
వింతగదిని సింగారించి రింతులంత.

గీ.పడకగదిలోని రతనంపు బసిడికోళ్ళ
దోమతెర పట్టెమంచంబు పై మెఱుంగు
టంచ దూదిపాంనున బవ్వళించియుండె
నతివరాకను మదిగోరియల్ల ఱేడు.

వ.అంతకమున్న.

చ.కలవమలంది నెన్నొసట గస్తురిబొట్టమరించి చేరలన్
గొలువగజాలు కన్ను గవకుంగగాటుకవెట్టి క్రొవ్వెదన్
వలపుగ్రమ్ము పూసరులు వావిరిజుట్టి పసిండిపుట్టము
జెలువుగ గట్టి చెల్వగయిసేసిరి సొమ్ములు వెట్టి నెచ్చెలుల్.