Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


అపడు నాకేమిచేయుటకును తోఁచలేదు. బ్రాహ్మణులకు రాక్షసస్త్రీని గాంధర్వవివాహమున కలియుగమునందు స్వీకరింపవచ్చునా యన్నధర్మసందేహమొక్కటి నామనస్సును భాధింపఁజొచ్చినది; రాక్షస స్త్రీలను వరించిన భీమాదులకు క్షత్రియులు; అది ద్వాపరయుగము. ఈ ధర్మ సందేహమును విడిచి లంకాద్వీపమునందు మన ధర్మ శాస్త్రముతో పని లేదని యంగీకరించి యొప్పు కొన్నను, మనదేశము నందలి గ్రామ దేవతలను సహితమును పొత్తులలోని చంటిపిల్లలనుగా గణింపఁదగినంత మహాకాయము గల యీ రాక్షిసిని వరుఁడు కాఁదగినంత పొడుగు నేనెట్లెదుగఁగలను ? ఆ చిన్నది యిది గాంధర్వవివాహమని చెప్పుచున్నను నాద్రష్టికిది కేవల రాక్షస వివాహముగాఁ బొడకట్టుచున్నది. మన దేశములో కన్యను పరుసెత్తుకొని పోవుట ధర్మము; ఈ రక్షస వివాహమున కన్యయే వరుడెత్తుకొని వచ్చుట తటస్ధించినది. హా! నేనేమి చేయుదును ? కామ దేవుఁడు కల్పించిన యీయాపద నెట్లు తప్పించు కొందును ? ఏంతచదువుకొన్నను స్త్రీలబుద్ధి యెప్పుడును పెడదారినే పోవునుగదా? మహా విద్వాంసులారా! ఈ చిన్న దానికి నన్ను తనంత స్ధూలరూపము వహించుమని నిర్బంధించుటయే కాని తాను నాకుఁదగిన సూక్ష్మరూపమును ధరింపవలెనన్న యాలోచన తోఁచినదికాదు. ఇక్కడ నింకొక ధర్మసూక్ష్మత యున్నది. రతిసమయమునందు స్త్రీలు నిజరూపమున పొందుదురని పెద్దలు చెప్పుదురు. అది యాలోచించియే యీమెనన్ను స్ధూల రూపము పొందుమని నిర్బంధించుచున్నదేమో! రాక్షస విగ్రహములుగల హిడింబాదులను పొందునప్పుడు భీమాదు లేమిచేసిరో! ఓభరతఖండవాసులారా! మనుష్యులైన భీమదులే పెరిగి రాక్షస రూపమును ధరించిరో, రాక్షసులైన హిడింబాదులే చిక్కి మనుష్యరూపమును ధరించిరో, పురాణములను శోధించి నాకు తెలుపుఁడు;