పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

నేనీమాట లనుకొనుచుండఁగా త్రిజట నామీఁద చేయివేసి వేగిరము స్థూలరూపము పొందుమని నన్ను నొక్కెను. అప్పుడు నా బ్రతుకు సింహపుపెండ్లికొడుకు కాలిక్రిందఁ బడి నలిగిన యెలుక పెండ్లి కూతురుబ్రతుకు కాఁగా, ఆనఖక్షతమునకు సహింపలేక నేను బావురని పెద్దపెట్టున నేడ్చితిని. ఆశూఁత విని వెలుపలినుండి యెవ్వరో " అమ్మాయీ ; ఆపిల్లికూఁత యెక్కడిది? " అనియడిగిరి. ఏమియులేదని చెప్పి త్రిజట యెవ్వరైనను వచ్చిచూచిపోదు రన్న భయముచేతఁ గాఁబోలును నన్ను మంచముమీఁదినుండి దింపి గోడమూలనున్న మందసము తాళముతీసి నన్నందులోఁబెట్టి మరల తాళమువేసెను. ఆ మందసము చిన్న గదియంత యున్నది. తాళముచెవి పెట్టురంధ్రము గవాక్షమంత యున్నందున్న లోపలికి తగినగాలి వచ్చు చుండుటచేత నేనాయాస పడక యొకబట్ట మడతమీఁద నొరగి కొచెముచేపు నిద్రపోయినాను.ఆనిద్రలో మహాకాయముగల వానరమొకటివచ్చి నన్నీడ్చుకొని పోవుచున్నట్లు కలగని యులికిపడిలేచితిని.స్వప్నములో కోఁతినిగాని వరాహమునుగాని చూచినపక్షమున భయముకలుగునని స్వప్నశాస్త్రాభిజ్నులగు పెద్దలు చెప్పుదురు గదా! ఈ కలవేకువజామున వచ్చినదగుటచేనెలదినములలోనే దానిఫలము కలుగునని నేను మఱింత భయపడఁజొచ్చితిని."దుస్స్వప్నే దుర్జనస్పర్శే స్నానమేవ విధీయతే" యన్న శాస్త్రప్రకారముగా స్నానము చేయవలెనన్నను పెట్టెలో మూయఁబడి యుండుటచే నాకదియు సాధ్యమైనదికాదు.

శ్లో.రామం స్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి.
అన్నశ్లోకమును నేను రాత్రి పరుండఁబోవున్నప్పుడు పఠింప మఱచి పోయిన దోషముచేత నాకీదుస్స్వప్నము సంప్రాప్తమయినది. కామరూవులయిన రాక్షసులయొక్క యీదేశమునందు దీనికేమి ప్రతిక్రియ