పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము


ముక్కులు కోయఁగూడ దందురు; ఆపయిని పుణ్యపురుషులు నినుపపెట్టెలలో పెట్టి తాళము వేయఁగూడ దందురు; అటుపిమ్మట వ్రద్ధపురుషులు పత్నులతో సహగమనము చేయఁగూడదందురు ; కట్టకడపట అపత్నీకులయిన పురుషులు మరల వివాహమే చేసి కొనవచ్చు నందురు. ఇంతకు వచ్చినది మఱియెంతకైనను రాకమానదు. ఆదుష్టురాండ్ర ప్రయత్నాంకురములను వికసింపనియ్యక మనము మొగ్గలలోనే త్రుంచి వేయవలేను. దేశాచారము సంరక్షిపవలయును. శాస్త్రధర్మములను నిలుపవలెను. దేశమతాభిమానుములను వహింపవలెను.ఆమూడురాండ్ర శాస్త్రజ్ఞానము లేని వారయి బుద్ధివాదములు చేయుచున్నారు. శాస్త్రబద్ధులమయిన మనకు మనుష్యబుద్ధి ప్రమాణముకాదు. పయి మతసత్యములు శాస్త్రముచేతఁగాక మఱి యేబుద్ధివలనఁ దెలియును? పాపాత్మురాండ్రయిన నవనాగరికురాండ్రు శాస్త్రనిషిద్ధమై ద్వాదశమహాపాతకములలోను గోరతమమైన పెండలవు దుంపకూరను రహస్యముగా నెవ్వరు నెఱుఁగకుండ తినుచున్నారఁట ఎంతఘ్ోరక్రత్యము చేయుచున్నారో చూచినారా? చూచినట్లొక్కరు పలుకరేమి? స్వపక్షస్ధాపనము కొఱకును పరపక్ష నిరాకరణము కొఱకును కల్లలాడవచ్చును. మతవిషయమున అసత్యదోషము లేదు. ఇది సూక్ష్మధర్మము. నామాట నమ్ముఁడు. చూడకపోయినను మీరిప్పుడు చూచినట్లు చెప్పుచున్నారు. నాకిప్పుడు పరమసఓతోషముగా నున్నది. మీరు నవనాగరిక బోధను నిర్మూలము చేయుటకు శ్రీజగద్గురువులు వారి యధికారము ను వ్యాపింపఁజేయుటకును దేశ మతాభిమానులు గలవారు ప్రాణములు కాశపడక పోరాడుఁడు".
ఈయుపన్యాసమువలన జనులు మనస్సులన్నియు పూర్వాచార పక్షమును తిరిగిపోయినట్టు కానఁబడినవి. మఱుసటిదినము మొదలుకొని ప్రజలు నవనాగరికుల విషయమున ననేకసత్యములను జెప్పుచు, అనేక