పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుక్మిణి - "కార్తీకసోమవారము కాదా? కడపటి సోమవారము గనుక ప్రదోష వేళ మా అమ్మతో కూడ శివాలయమునకు వెళ్లవలెనని గోదావరి స్నానము చేయవచ్చినాను".

పెద్ద ముత్తైదువ - మీరు రాత్రి దాక భోజనము లేకుండనుండగలరా?

రు - "ఒక్క దినమునకేమి? ఏలాగునైన నుందును. మొన్న మీ రెండవ చిన్నదానికి శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పుడు కొంచెము నిమ్మళముగా నున్నదా?"

పె - "ఏమి నిమ్మళమో నాకు తెలియదు. మావారు రెణ్ణెల్లం బట్టి కామావధానుల చేత విభూతి పెట్టించుచున్నారు. రాత్రి తెల్లవారిన దాక నిద్ర లేక బాధపడినాము".

రు - "గ్రహబాధా యేమి?"

పె - "అవునమ్మాయీ! ఏమి చెప్పుకోను? మగడు" - అని 'యిక్కడ నెవరును లేరు గదా' యని నాలుగు ప్రక్కలను జూచి మఱింత దగ్గరగా జరిగి చెవిలో మెల్లగా "మగడు పట్టుకొని వేపుకొని తింటున్నాడు. మీరెఱుగుదురు గదా దానికి పెండ్లియయి మూడేండ్లు కాలేదు. అప్పుడే దాని మగడు పోయి ఆఱు నెలలయినది. అప్పటి నుండియు దానికి కొన్నాళ్లు కలలోను కొన్నాళ్లు రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడును కనబడుచునే యున్నాడు. పి‌ల్లకి సిగ్గు చేత ఎవ్వరితోను చెప్పక దాచినది. నెల దినముల నుండి బొత్తిగా ఎప్పుడును విడువక రేయింపగళ్లు వెంటవెంటనే యెక్కడికి వెళ్లిన నక్కడికి దిరుగుచున్నాడు. ఏమి పాపమో కాని మూడు దినముల నుండి మఱింత పీకుకొని తింటున్నాడు. ఈ మూణ్ణాళ్లలోను పిల్లది సగమయిపోయినది. ఇంతే గదా? మగనితో" - అని కడుపులో