పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడు పేరిననెత్తురుముద్దను త్రాటి చివరనున్న గాలమునకు గ్రుచ్చి, లేచి నిలువబడి కుడిచేతితో సత్తువ కొలదిని త్రాడు గిరగిర త్రిప్పి లోతు నీటన్విసరవైచి మరల గూర్చుండి చేప యెప్పుడు చిక్కునాయని తదేకధ్యానముతో త్రాడు వంకనే చూచుచు త్రాడు కదిలినప్పుడెల్ల నులికిపడుచు దైవవశమున చేప గాలమును మ్రింగి కొట్టుకొనుచుండ మెల్లమెల్లగా లాగుచు, త్రాడు తెంపుకొని పాఱిపోవునో యను భయమున గుడిచేతిలోని త్రాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేప కలసట వచ్చిన తరువాత నొడ్డునకు లాగి పెన్నిధి గన్న పేద వలె బరమానందము నొందుచు, ఒడ్డు దాక వచ్చిన తరువాత గ్రహచారము చాలక మత్స్యము త్రాడు తెంపుకొని పఱచిన చేతిలో బడ్డ సొమ్ము పోగొట్టుకొన్నవాని వలె నిర్వేదించు చేప రాకపోగా రెండణాల గాలము కూడ బోయెనని విచారించుచు వట్టి చేతులతో నింటికి బోయెను. ఆ సమీపముననే యొడ్డున జేరి కుఱ్ఱవాండ్రు వెదురుచువ్వ కొక దారమును గట్టి దాని కొననున్న చిన్న గాలమునకు ఎఱ్ఱలను గ్రుచ్చి నీళ్లలో వైచుచు దటాలున దీయుచు జిన్న చేపలను బట్టుకొని మఱియొక దారమునకు గుదిగ్రుచ్చి 'నాకు బది జెల్లలు దొరికినవి' 'నాకు నాలుగు పరిగెలు దొరికిన'వని యొండొరులతో జెప్పుకొనుచు సంతోషించుచుండిరి. అక్కడి జువ్విచెట్టు మీద గూర్చుండి చూచుచున్న చెడు గ్రద్ద యొకటి యకస్మాత్తుగా వచ్చి యొకటి రెండు పర్యాయములు పిల్లవాండ్రు త్రాడునకు గ్రుచ్చుటకయి చేతబట్టుకొన్న చేప నెగరదన్నుకొని పోయెను.

అప్పుడొక్క పెద్దముత్తయిదువ మొగమంతయు నొక్కటే బొట్టు పెట్టుకొని, బట్టలతోనున్న బుజము మీది బిందెను తీసి చేతబట్టుకొని రుక్మిణియున్న తావునకు వచ్చి గౌరవము తోప "అమ్మాయి గారూ! ఏమి? మీరీ వేళ స్నానమునకు దయ చేసినారు".