Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీలు; రాజకీయోద్యోగులు స్త్రీలు; మంత్రులు స్త్రీలు; విద్వాంసులు స్త్రీలు; సైనికులు స్త్రీలు. వేయేల? ఆ దేశమంతయు స్త్రీమయము. స్త్రీలే సర్వస్వతంత్రలు; పురుషులు వారిదాసులు. ఆహా! లోకములో నింతకంటె దుర్దశ మఱియొకటియుండునా? ఈ సంగతి విన్న పురుషాభిమాని యగువాని దేహము భగ్గున మండదా? పురుషుల యందభిమానము గలిగి, పురుషుల యాధిక్యమును నిలుపుటలోఁ బ్రతిష్ఠ వహించి, పౌరుష భూషణులైన యోభరతఖండవాసులారా! మన దేశమునందు పురుషజన్మ మెత్తిన వారందఱును ఆయుధహస్తులయి బయలుదేఱి, నేను చెప్పిన గుహామార్గమున ఈ దేశమునకు వచ్చి, అన్యాయముగా పురుషుల పయి నధికారము చెల్లించుచున్న స్త్రీలనందఱిని ఘోర యుద్ధములో జయించి, ఈ పాడు దేశములోఁ గూడ పురుషుల స్వాతంత్ర్యమును నిలుపుఁడు. మర్మజ్ఞుఁడనైన నేను మీకు సహాయుఁడనై యుండఁగా మికాపజయ మెప్పుడును గలుగదు. మీరు భయపడఁ బోకుఁడు.

ఇక్కడ స్త్రీలది యాజమాన్య మన్నమాటయే కాని వారిలో నైకమత్యములేదు. వారిలోఁ గొందఱు పురుషులకు విద్య చెప్పించి వారికిఁ గొంతవఱకు స్వాతంత్ర్యము లియ్యవలెననువారు; బాహుసంఖ్యాకులైన రెండవ తెగవారు పురుషుల కెప్పుడును విద్య చెప్పింపఁగూడ దనియు విద్య చెప్పించుట వలన స్వేచ్ఛా విహరులై చెడిపొవుదురనియు భావించి పూర్వాచారమును నిలుపుటకు పాటుపడువారు. ఇది స్వతంత్ర రాష్టము సహితము కాదు. దొరతనము వారికిని ప్రజలకును ఐకమత్యము లేదు. పరిపాలనము చేయువారు స్వదేశస్ధులకంటె నెక్కువ నాగరికముగలవారై యాదేశమునకు దక్షిణముననున్న పర్వతములను దాటి వచ్చి దేశమును జయుంచిరి. వీరు తమ పురుషులకు విద్యచెప్పించికొని స్వాతంత్ర్యములనిచ్చి వారిని గౌరవముతోఁ జూతురు. వారా