పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరదాచార్యులు పోగానే వైద్యముకూడ నారంభించి వాడిప్పుడు గ్రామములో ఘనవైద్యుడయి యున్నాడు. మొదట వైద్యమారంభించినప్పుడు క్రొత్తగనుక రోగముల నామములను ఔషధనామములను మానాయనచేతనే వ్రాయించుకొని, యెఱ్ఱనివియు నల్లనివియు నయిన కుప్పెలుచేసి తీసికొనివచ్చి యేమం దేరంగుగలదిగా నుండునో మానాయనవలననే తెలిసికొని వానిమీద "పూర్ణచంద్రోదయము" "వాతరాక్షసము" మొదలయిన పేర్లనువ్రాసి యంటించినాడు. జీలకఱ్ఱ, మిరియములు, మొదలయినవస్తువులలో సిందూరమువేసి నిమ్మకాయలరసముతో నూరి మాయింటచే మాత్రలుచేసి తీసికొని వెళ్ళుచుండెను. అతడేయౌషధమునడిగీనను తనయొద్దలేదనక తులమునకు రూపాయమొదలుకొని యిరువది రూపాయలవఱకును వెలగట్టి యిచ్చు చుండెను. ఆరంభదశయందు వచ్చినసొమ్ములో మానాయనకుగూడ భాగమిచ్చెడివాడుగాని తానుపెద్దవైద్యుడని పేరుపొందిన తరువాతను మానాయనకు గ్రామములోనివారితో విరోధమువచ్చిన తరువాతను భాగమిచ్చుట మానివేసినాడు. అట్టివాడు మానాయన స్వయముగా వెళ్ళి తన భార్యకు జబ్బుగా నున్నదని బతిమాలి పిలిచినను ప్రజలకు వెఱచి యొక్కసారి చేయియయినను చూచి పోయినవాడుకాడు. వేయేల? ఊరివారు పెట్టవలసిన నిర్భంధముల నన్నిటిని బెట్టిరి; చీకటిపడినమీదట ఇంటిమీద బెడ్డలువేయ నారంభించిరి. నన్ను భార్యకు గావలిపెట్టి మానాయనయే చెఱువుకుబోయి స్నానముచేసి నీళ్ళుతెచ్చుకొని వంటచేసి పగలు రెండు జాములకు పథ్యముపెట్టుచు, మీరయిన గ్రామములోనున్న దనకింత యిబ్బంది రాదుగదా యని మీరుచేసిన యుపకారములను దలచుకొనుచు బహువిధముల విచారించెను. బహుప్రయాసముమీద కొన్నిదినములకు మాతల్లికి వ్యాధి నిమ్మళించినదిగాని దేహములో