పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రశక్తిచేతనే బాధపడుచున్నారని తలంచిరి. కాబట్టి యెల్లవారును కొంతకాలమునకు మానాయనను గ్రామమున కొక మృత్యుదేవతనుగా జూచుకొనుచుండిరి. మా నాయనపొడ గనబడినప్పుడెల్లను గ్రామములోని యూడువారు నెటికలువిఱిచి తిట్టజొచ్చిరి. మగవాండ్రు కొఱకొఱలాడుచు మునుపటివలె మాటాడక యాతడు కనబడినపు డెల్లను తప్పించుకొని పెడదారిని తొలంగిపోవుచుండిరి. ఇరుగుపొరుగునున్నవారు నిప్పుసహితము పెట్టమానివేసిరి; ఏవస్తువు బదులునిమిత్తము వెళ్ళినను లేదనుచుండిరి. పొరుగువారు తమనూతిలో నీళ్ళు తోడుకొన వలనుపడదనిరి. అందుచేత నీప్రకారముగా శత్రుమధ్యమున కాపురముచేయుట మానాయన కెంతో భారముగానుండి, ఇదియంతయు దాను భూతవ్యెద్యుడనని వేషము వేసుకొనుటవలన గలిగిన పాపఫలముగదా యని తెలుసుకొని పశ్చాత్తాపపడిన కార్యములేక స్వయంకృపరాధమునకు నోరెత్తక యనుభవించుచుండెను. ఇట్లున్న సమయములో నొకసారి సవతితల్లికి దేహములో రుగ్ణతవచ్చినది; అప్పుడెందఱిని గాళ్ళుగడుపులు పట్టుకొన్నను ఒక్కరైనను పథ్యపానములుచేసి పెట్టుటకు గాని నిద్రరాకుండ దగ్గఱనుండి మాటలు చెప్పుటకుగాని వచ్చివారుకారు; గ్రామములోనివా రెవ్వరును పథ్యపానమునకయి తమనూతిలోనుండి నీళ్ళుసహితము రెచ్చుకోనిచ్చినవారు కారు; మీరు గ్రామమునుండి లేచివచ్చిన నాలవనాడే మనగ్రామములో వ్యెద్యుడుగా నుండిన నంబి వరదాచార్యులు పోయినాడు. నేతి రామయ్య మనయింట వంటబ్రాహ్మణుడుగా నుండి కంచుచెంబుల జో డెత్తుకొనిపోయి ముండ కిచ్చనందునకయి మిరు పని తిసివేసిన తరువాత వాడు మఱియెంధునకును పనికిరాని వాడౌటచేత చదువులబడి పెట్టుకొని జీవనము చేయుచుండెనుగదా!