Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని రుక్మిణి చెప్పినతరువాత రాజశేఖరుడుగారు కొమార్తె యొక్కబుద్ధికిని సాహస కార్యమునకును సంతోషించి యామెను కౌగలించుకొని మిక్కిలి గారవించెను. రుక్మిణియొక్క యీ చరిత్రమును విన్నవా రెవ్వరైనను, ఉన్నయూరిలో సహితము గడపదాటి పొరుగువీధికైన నెప్పుడును పదచలనముచేసి యెఱుగనంత సుకుమారిగా బెరిగిన పదునాలుగేండ్ల ప్రాయముగల ఒక్క ముగ్ధబాలిక అంతటిధైర్యమును పూని సమయోచిబుద్ధితో మంచియుపాయము నూహించి. పరుల కెవ్వరికిని భేద్యముకాని మాఱువేషమును ధరించి లోకానభవమువలన నాఱితేఱిన ప్రౌడాంగనలకు సయితము కష్టసాధ్య మయినరీతిని ప్రచ్ఛన్నముగా నుండగలిగిన దన్నవాతన్ నమ్మశక్యముకాకున్న దనవచ్చును. ఎవరునమ్మినను ఎవరునమ్మక పోయినను వాస్తవమును మఱుగపఱచక చెప్పుట చరిత్రకారునికి విధాయకకృత్యము గనుక, జరిగినసంగతినేమో జరిగినట్టుచెప్పుచున్నాను. పురాణగాధలయందువలె మనుష్యులు లేడిరూపమును ధరించినారని కాని పురుషులు కేవలస్త్రీలుగానే మాఱినారని కాని అసాధ్యమయిన సంగతి యిందేదియు దెలుపబడలేదు. ఆమె కిట్టియద్భుతవిధమున బ్రవర్తింపనేర్చినది యామెనాశ్రయించియున్న సరస్వతియే కాని స్వశక్తి కాదు. విద్యాప్రభావము నెఱిగినవా రెవ్వ రిట్టిదొక ఘనకార్యమని యాశ్చర్యపడుదురు?