పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 రాజశేఖర చరిత్రము

నుండి పాఱిపోయి, యింటఁగూరుచుండి యొడలు వంచి పనిచేయు వారినే చేరును. దాని కేమిగాని మిగిలిన వృత్తాంతమును చెప్పుము.

సత్ర - మా పట్టణమున ననేకులు రాత్రులు పురాణకాలక్షేపమును జేయుదురు. ఇక్కడకు దగ్గఱనే యొక పెద్దమనుష్యుఁడున్నాడు.ఆయన యెప్పుడును చదువక పోయినను తాటాకుల పుస్తకము నొకదానిని విప్పి సర్వదా ముందు పెట్టుకొని కూరుచుండును. మన పొరుగింట కాపురమున్న సముతుదారుగారి తల్లికి పురాణమన్న నెంతో యపేక్ష; ఆమెకు నిద్ర రానపుడెల్లను పురాణము చదువుమనును; పురాణ మారంభించిన తరువాత మంచి కథపట్టు రాఁగానే గోడను చేరగిలఁబడి హాయిగా నిద్రపోవును.

రాజ- ఇక్కడి వర్తకు లెటువంటివారు?

సత్ర- వర్తకులు తమ సరకులను మాత్రమే కాదు, మాటలను సహితము విశేషలాభమునకు విక్రయింతురు. అయినను వారి కెంతలాభము వచ్చినను, ఆలాభము మాత్రము వారి యాశకుఁదగి యుండదు. ఈ సంగతి నెఱిఁగి యిక్కడి పెద్దమనుష్యులు కొందఱు మొదట వారి వర్తకశాలకుఁ బోయి యొక వస్తువును గొని వారడిగిన వెల నిచ్చివేయుదురు; ఆపయిన చిన్నవస్తువు నొక దానిని అరవు తెచ్చించి, దాని సొమ్మును మఱునాఁడే పంపివేయుదురు; ఆటుపిమ్మట క్రమక్రమముగా పెద్దవస్తువులను దెప్పించి వానివెలలనుగూడ యుక్తసమయముననే యిచ్చివేయుదురు; ఈ ప్రకారముగా నమ్మకము కుదిరిన తరువాత పెండ్లి పేరో మఱియొక శుభకార్యముపేరో చెప్పి విలువవస్తువులను విస్తారముగా దెప్పించి కడపటఁ సొమ్మియక యపహరింతురు.

రాజ- ధనము నిమిత్తము ఈ ప్రకారముగా నక్రమమున కొడి ధట్టిన కీర్తిపోదా?