పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తొమ్మిదవ ప్రకరణము

సత్ర- కీర్తికేమి? దానిని కొనుట కయి ముందుగా ధనము సంపాదించినయెడల తరువాత నిమిషములో కావలసినంత కీర్తిని కొనవచ్చును;


రాజ- మీరాజుగా రెంతో ధర్మాత్ములనియు ప్రజలను న్యాయ మార్గమున నడిపించువారనియు ఎప్పుడును వినుచుందును. వారి రాజధానియైన యీ పట్టణమునందె యిట్టి ఘోరకృత్యములు జరుపుచుండగా రాజుగారు సహించి యూరుకున్నారా?

సత్ర- ఈపట్టణములో నిప్పుడేమి యక్రమములు జరుగుచున్నవి? మహారాజుగారి తండ్రిగారి కాలములో పూర్వము జరుగుచుండెడి ఘొరకృత్యములలో నిప్పుడు గుమ్మడికాయలో నావగింజంత పాలయిననులేవు. ఆ కాలములోనే మీరీ పట్టణమునకు వచ్చియుండిన యెడల మంచి బట్టలు కట్టుకొని పట్టపగలీప్రకారముగా వీధిలో నిర్భయముగా నడవఁగలిగి యుందురా? మా రాజుగారు సహస్రముఖముల కనుగొని నిత్యమును దుర్మార్గులననేకులను శిక్షించుచుండుటచేతనే యిప్పుడు నరహత్యలు మొదలయిన ఘోపాతకము లేనియు జరగకున్నవి.

రాజ- ఈపట్టణములో వేదవిహిత కర్మానుష్ఠానములు చక్కగా జరుగుచుండునా?

సత్ర- త్రికాలములయందు యధావిధిగా జరుగుచుండును.

రాజ- అట్లయిన, నీవిప్పుడు సంధ్యావందనము చేసినావా?

సత్ర- ఎన్నడో వడుగునాఁడు నేర్చుకొన్న సంధ్యావందనము మరచిపోక యిప్పటిదాఁక ఙాపక ముంచుకొన్న ననుకొన్నారా?

రాజ- పోని; అర్ఘమునయిన విడిచినావా?

సత్ర- ఒక్క అర్ఘమును మాత్రమేకాదు. సంధ్యావందనమంతయు విడిచినాను.