- రాజశేఖర చరిత్రము
రాజ- మావంటి బీదవారికి విశేషధన మెక్కడనుండివచ్చును? అయినను మేము నూరు రూపాయల సొమ్ము తెచ్చుకొన్నాము.నేలాగునైనను వానితోనే గంగాయాత్రచేసికొని రావలెననియున్నది.
యోగి- మీరు బహుజాగ్రత్తగా నుండవలెను.ఇక్కడకు రెండుక్రోసుల దూరములో నున్నవేఁడిమంగలమువద్ద బాటసారులను దొంగలు కొట్టుచుందురు.గడియసేవు తాళుదులేని మాశిష్యులను తోడిచ్చిపంపెదము.
అనిచెప్పి యాయోగి తావళమును ద్రిప్పుచు మరల జపముచేయనారంభించెను.ఏ వేళకునునాతని శిష్యులు రానందున, రాజశేఖరుడుగారు మనసులో తొందరపడుచుండిరి.ప్రొద్దును అంతకంతకు వాలుచుండెను.
రాజ- స్వామీ! మీశిష్యులీవఱకును రాలేదు.రెండు గడియలప్రొద్దున్నది.వేగిరము వర్తమానముపంపెదరా?
యోగి- ఆవశ్యముగా బంపెదను. అని చివాలునలేచి జువ్విచెట్టునకు నూఱుబారల దూరములోనున్న యొక గుడిసెయొద్దకుఁబోయి 'గోపాలిగా' యని యొకపిలుపు పిలిచెను. లోపలినుండి చినిగినగుడ్డను కట్టుకొని బొగ్గువంటి శరీరముతో బుఱ్ఱముక్కును, మిట్టనొనలును, తుప్పతలయు, గొగ్గిపళ్ళను గల యొకకిరాతుఁడు బయలవచ్చెను. వానితో నేనేమో మాటాడుచు పందిరివఱకును దీసికొనివచ్చి, రాజశేఖరుఁడుగారు వినుచుండగా 'వీరికి సహాయముగా బంపుటకయి మనవాండ్రను బిలుచుకొని యిక్కడ నున్నట్టుగా రమ్మ 'ని వంపెను.
రాజ- స్వామీ! మీశిష్యులేవేళకు వత్తురో చీకఁటి పడక ముందేవేఁడిమంగలము దాఁటవలెను. మేము నడచుచుందుమా?