పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలిచిపోవుటయు, మొదలుగాఁగల కథను దగ్గఱనున్న వారివలన విని, రాజశేఖరుఁడుగారు సారంగధరుని కాళ్ళను జేతులను, నఱికిన స్థలమునే జూచిరావలె నని బయలుదేఱి సారంగధరుని మెట్టకుఁ బోయి యక్కడ నొకనిమ్మచెట్టుక్రింద సారంగధరుని కాళ్ళను చేతులను ఖండించిన చాపరాతిని దానిచుట్టును గడ్డిసహితము మొలవక నున్నగా నున్న ప్రదేశమును దాని సమీపముననే సిద్ధుఁడు సారంగధరుని గొనిపోయి స్నానముచేయించిన కొలఁకును జూచి వచ్చిరి. రాజమహేంద్రవరములో నున్న కాలములో రాజశేఖరుఁడుగారు పట్టణములో నుండెడిజనులకును పల్లెలలో నుండెడిజనులకును నడవడియందేమి వ్యత్యాసముండునో చూడవలె నని యెల్లవారియొక్క చర్యలును బరీక్షింపసాగిరి; కాఁబట్టి యిప్పుడిప్పు డాయనకు నిజమయిన ప్రపంచజ్ఞానము కొంతవఱకుఁ గలుగ నారంభించెను. ఆపట్టణములో___ఎరువడిగి తెచ్చుకొనియైనఁ జేతికి మురుగులు నుంగరములును వేసికొని, చాకలివానియొద్ద పడిదెకుఁ దెచ్చుకొనియైనను విలువబట్టలను గట్టుకొనువారె మిక్కిలి గౌరవమునకుఁ బాత్రులుగా నుండిరి. లోపల సారమేమియు లేకపోయినను జెవులకు మంచి కుండలములను జేయించుకొని తలకు గొప్పశాలువను జుట్టుకొన్నవారు మహాపండితులుగా నుండిరి. ఎల్లవారును ధనికుల యిడ్లకుఁ బోయి జీవితకాలములో నొకప్పుడు దేవాలయము త్రొక్కి చూడకపోయినను భగవన్నామమును కలలో నైనను స్మరింపకపోయినను వారిని పరమభాగవతోత్తము లని భక్తాగ్రేసరు లని పొగడుచుంటిరి; నిజమైన విద్వాంసులయొక్కయు కవీశ్వరులయొక్కయు నోళ్ళును కడుపులును సదా శ్లోకములతోను పద్యములతోను మాత్రమె నిండియుండెనుగాని బాహ్యదంభము లేకపోవుట