పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేత నన్నముతో నొకప్పుడును నిండి యుండలేదు; దినమున కెనిమిది దొమ్మరగుడిసెలలో దూఱినను, స్నానము చేసినట్టు జుట్టుచివర ముడివైచుకొని బిళ్ళగోచులను బెట్టుకొని తిరుగువారు పెద్దమనుష్యులని పొగడొందుచుండిరి. వేయేల? చాటున లక్షదుష్కార్యములు చేయుచున్నను, బాహ్యవేషధారణమునందు మాత్రము లోపము లేకుండనున్నచో వారి ప్రవర్తనమును సంపూర్ణముగా నెఱిఁగియు వట్టివారి కందఱకును సభలోసహితము మంచి నడవడి గలవారికిఁ చేయుదానికంటె నెక్కువ మర్యాదను జేయుచుండిరి. నీతివిషయమున వారి ప్రవర్తన మెంతహేయ మయినదిగా నున్నను, మతవిషయము నందుమాత్రము పయికి భక్తులుగానే కనఁబడుచుండిరి. నిలువ నీడలేక బాధ పదుచుండెడి ప్రాణమిత్రుల కొక కుటీరమును గట్టించి యియ్యలేనివారు సహితము, రాతివిగ్రహములు కాపురముండుటకయి వేలకొలఁది వెచ్చబెట్టి దేవాలయములు కట్టించుచుండిరి; కట్టించినవారు పోయినతరువాత వసతులు లేక పాడుపడిన దేవాలయములను నూట యిరువదిమూటిని లెక్కపెట్టి రాజశేఖరుఁడుగారు కోటిలింగములకుఁగూడ బూర్వమెప్పుడో దేవాలయములు పాడయినందున నాప్రకారముగా నిసుకదిబ్బలయందుఁ బడియుండినవై యుండవచ్చునని సంశయించిరి; అక్కడ వేశ్యలు తప్ప మఱియెవ్వరును స్త్రీలు చదువకుండిరి; అట్టివా రభ్యసించిన విద్యయంతయు వ్యభిచారమును వృద్ధిచేసి పురుషులను దమ వలలలోఁ బడవేసుకొని పట్టణము పాడు చేయుటకొఱకే పనికి వచ్చుచుండెనుగాని జ్ఞానాభివృద్ధికిని సన్మానప్రవర్తనమునకును లేశ మయినను తోడు పడుచుండలేదు.

అక్కడ సప్తమివఱకు నుండి రాజశేఖరుఁడుగారు కాశీకివెళ్ళుటకు ప్రయాణ మయిరిగాని, సంవత్సరాదివఱకు నుండుఁడని రామ