పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలె నని యుండెను. ఆకోరిక యిప్పు డీవిధముగా నెఱవేఱనున్నందునకు సంతోషించి, రాజశేఖరుఁడుగారు సకుటుంబముగా గంగాస్నానము చేసివచ్చుటకు నిశ్చయించి తారాబలమును చంద్రబలమును బాగుగనున్నయొక చరలగ్నమునందుఁ బ్రయాణమునకుఁ ముహూర్తముపెట్టి "ప్రతపన్నవమిపూర్వే" యని యుండుటచేత తిథిశూల లేకుండఁ జూచుకొని "నపూర్వేశనిసోమేచ" యనుటచేత వారశూల తగులకుండ ఫాల్గునశుద్ధ త్రయోదశీ బుధవారమునాఁడు మధ్యాహ్నము నాలుగుగడియల ప్రొద్దువేళ బయలుదేఱుటకు బండి నొకదానిని గుదిర్చి తెచ్చిరి. వారీవఱకుఁ జేసిన యాత్ర లన్నియు గోదావరియొడ్డుననుండి యింటియొద్దకును, ఇంటియొద్దనుండి గోదావరియొడ్డునకునేకాని యంతకన్న గొప్పయాత్రలను జేసినవారుకారు.

బండిని తెప్పించి వాకిటఁగట్టిపెట్టించి ప్రయాణముహూర్తము మించిపోకమునుపే బండిలో వేయవలసిన వస్తువులను వేయవలసినదని రాజశేఖరుఁడుగారు పలుమాఱు తొందరపెట్టినమీఁదట మాణిక్యాంబ తెమలివచ్చి బండినిండను సుద్దతట్టలను బుట్టలను చేఁదలను నింపి మఱియొకబండికిఁ గూడఁ జాలునన్నిటిని వీధిగుమ్మములో నుంచెను; బండిలో నెక్కవలసిన యిత్తడిపాత్రములును బట్టలపెట్టెలును లోపలనే యుండెను; ఇంతలో రాజశేఖరుఁడుగారు వచ్చి యాబుట్టలు మొదలగువానిని బండిలోనుండి దింపించి వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడవచ్చిన బీదసాదలకుఁ బంచిపెట్ట నారంభించెను. ఆవఱకు లోపలనుండి కదలి రాకపోయినను రాజశేఖరుఁడుగారు వస్తువులను బంచిపెట్టుచున్నా రన్నమాటను విన్నతోడనే యిరుగుపొరుగుల బ్రాహ్మణోత్తములు వాయువేగమునఁ బరుగెత్తుకొనివచ్చిరి. బండిలో స్థలముచాలక క్రిందనుంచిన తట్టలు మొదలగు