పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానిని మాణిక్యాంబయుఁ దన్ననుసరించుచున్నవారికిఁ బంచి పెట్టెను. తరువాతఁ బెట్టెలును నిత్తడిసామానులును బండిలో నెక్కింపబడినవి; మునుపు నాలుగుబండ్లలో నెక్కించిననుసరిపోని సామానులిప్పు డొక్కబండిలోకే చాలక దానిలో నలుగురుగూరుచుండుటకు స్థలముకూడ మిగిలెను. రాజశేఖరుఁడుగా రెంత తొందరపెట్టుచున్నను మాణిక్యాంబ తనకాప్తురాం డ్రయిన యొకరిద్దఱు పొరుగు స్త్రీలవద్ద సెలవుపుచ్చుకొని వచ్చుటకే ప్రత్యేకముగా నాలుగుగడియలాలస్యము చేసెను. ఈలోపుగా మంచములను బండిగూటిపయిని గట్టించి, పిల్లలను బండిలో నెక్కించి, రాజశేఖరుఁడుగారు కోపపడినందున మాణిక్యాంబ వచ్చి బండిలోఁ గూరుచుండెను. బండివాని యొద్దకు వచ్చినప్పటినుండియుఁ గొంచెము వట్టిగడ్డిపరకలతోను కావలసినంత జలముతోను మితాహారమును గొనుచు పథ్యముచేయుచున్న బక్కయెడ్లు మెల్లగా బండిని లాగనారంభించెను. బండివాఁడును వానివెనుకనేనడచుచు మేఁతవేయుటలోఁ బరమలుబ్ధుఁడుగానేయున్నను కొట్టుటలోమాత్రము మిక్కిలి యౌదార్యమును గనఁబఱుపసాగెను. ఊరిబయలవఱకునువచ్చి, రాజశేఖరుఁడుగారివలన బిచ్చములను గొన్న నిరుపేదలయిన తక్కువజాతులవారు పలువిధముల వారిని దీవించి, విచారముతో వెనుకకు మరలిపోయిరి. నల్లమందు వేసికొనుటచేతనో త్రాగుటచేతనో సహజమైన మత్తతచేతనో యీమూడును గూడఁ గలియుటచేతనో త్రోవపొడుగునను తూలుచుఁ గునుకు పాట్లుపడుచు నడుచుచున్న బండివాఁడు మొత్త నెక్కి కూరుచుండి, బండిలోనివారికిఁ గావలసినంత పరిమళమును ఆకాశమునఁ జిన్న మేఘములును గలుగునట్టుగా సగముకాలియున్న ప్రాఁతపొగచుట్టలను నాలిగింటిని గుప్పుగుప్పునఁ గాల్చి బండిలోనిపెట్టెకుఁ జేరగిలఁబడి హాయిగా నిద్రపోయెను. బండియు మెల్లగా ప్రాకుచున్నట్టే