పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆత్మ కధ కన్నడ మూలం: డా.చంద్రప్ప సొబటి; తెలుగుసేత: రంగనాథ రామచంద్రరావు 90597 79289

కిరాయిబండి చివరి ప్రయాణం

ఆ సంవత్సరం ఆటకు వచ్చిన సంభావన పెరిగింది. అయితే నా బండి కిరాయి మాత్రం పెరగనేలేదు.

ఉద్దేశపూర్వకంగా పెంచలేదని కాదు. పెంచాలనే చర్చ మేళంలో జరిగింది. ఆటకు వస్తున్న సంభావన చూసి రోజు కిరాయి వంద రూపాయలు కావచ్చని, కనీసం ఎనభై అయినా కావచ్చని ఆశగా ఎదురుచూడసాగాను.

అయితే నా ఆశను షావుకారిగారి బస్సులు మింగేశాయి.

అప్పుడప్పుడే పల్లెపల్లెకూ షావుకారుగారి బస్సులు రావటం మొదలయ్యాయి.

మేళంవారు ఎద్దుల బండిలో కార్యక్రమాలకు వచ్చిపోవడం కన్నా బస్సులో వెళ్ళిరావటమే సౌకర్యంగా ఉంటుందని అన్నారు. ఎందుకంటే అప్పటికే మేళంలోని కొందరు సభ్యులు బస్సులలో వచ్చిపోయేవారు. దాంతో మేము ఏమీ మాట్లాడలేదు. మాట్లాడలేదని అనటంకన్నా మా నోట మాటలే రాలేదని చెప్పాలి.

నేను మౌనంగా నాన్న ముఖం చూశాను. ఏమ్హైనా చెబుతారేమోనని ఎదురుచూశాను. ఆయన కూడా షావుకారు బస్సులో వెళ్ళిరావటమే మంచిదని అన్నారు. అది నాన్న నుంచి ఊహించిన జవాబే. అందువల్ల నాన్నపట్ల ఎలాంటి కోపం రాలేదు. నాన్న ఎన్నడూ స్వార్ధంతో నిర్ణయాలు తీసుకున్నవారు కాదు.

కిరాయికి బండి వద్దన్న రోజున నేను శికారిపుర తాలూకాలోని ఓ గ్రామంలో ఉన్నాను.

ఉదయం ఆట కావటం వల్ల తొందరగా ముగిసింది.

ఎద్దుల బండిలో బొమ్మలు పెట్టెలను వేసుకున్నాను.

ఎన్నడూ భారంగా అనిపించని ఆ పెట్టెలు ఆ రోజు ఎందుకనో భారంగా అనిపించాయి.

వాటిని ఎత్తి బండిలో పెట్టడానికి మేళంవారి సహాయం తీసుకోవాలని అనిపించింది.

వాళ్ళవైపు చూశాను.

వాళ్ళంతా డబ్బులు పంచుకోవడంలో మునిగివున్నారు.

నేను ఆ రోజు కిరాయి విషయానికి పోనేలేదు.

రోజుకు యాఖై, అరవై సంపాదించేవాడిని.

ఈ రోజ ముగిసిందికదా అని దుఃఖం కలుగుతోంది.

ఆగకుండా కన్నీళ్ళు బుగ్గల మీదుగా జారిపోతున్నాయి.

నా దుఃఖాన్ని ఎవరికీ చూపించుకోవాలని అనిపించలేదు.

ఆ దుఃఖంలో ఎద్దులబండి కట్టుకుని ఊరివైైపు ప్రయాణమయ్యాను. ఇది కళా జీవితపు ఎద్దులబండి చివరి ప్రయాణమని దారిపొడుగునా అనిపించింది. నా అంతట నేను ఏడుస్తున్నాను. ఇది బండిలో నా వెనుక కూర్చున్న వారు అది గమనించలేదు. గమనించినా వారికి అర్ధం కాలేదని అనుకుంటాను. బహుశా అందుకే నా సంకటం, దుఃఖంలో వాళ్లు భాగం వహించలేదు. నన్ను ఓదార్చటానికి ప్రయత్నించలేదు.

ఆ రోజు నేను దారిలో ఎద్దులను కొట్టలేదు.

కసరలేదు.

అదిలించలేదు.

బండి ఎప్పటిలా రోజుకన్నా కాస్త ఆలస్యంగా వచ్చి ఊరు చేరింది.

అవి తెల్లటి ఎద్దులు.

మా ఇంట్లో తెల్లఎద్దులనే బండికి కట్టాలనే నియమం ఉంది.

ఎద్దుల మెడలకు పెద్దపెద్ద కంచు బిళ్ళలున్న పట్టీలను అలంకారంగా కట్టాం.

మా బండి ఊళ్ళోకి వెళ్ళడమే ఒక వినోదం. బండి ఊళ్ళోకి వెళితే చాలు! జనం మా బండినే చూసేవారు. మేము ఎవరో పరిచయం చేసుకోవటానికి ముందే మా ఎద్దులబండి మా రాకను పరిచయం చేసేసేది. అలాంటి ఎద్దులకు ఒక్కోసారి మేత దొరికేదికాదు. ఊరి జనాన్ని అడిగితే తెలిసినవారు ఇచ్చేవారు. ఒక్కో ఊళ్ళో కుళ్ళిన తడిసిన మేతను ఇచ్చేవారు. ఆ రోజున నాకు చాలా దుఃఖం కలిగేది. మేము భోంచేసి, వాటిని ఉపవాసం 'పెడుతున్నామని కుమిలిపోయేవాళ్ళం. పల్లెలలో కొంతమంది పోకిరీలు ఉంటారు. ఎద్దుల మెడలోని పట్టీలకున్న కంచు వస్తువులనురాళ్ళతో కొట్టడం, కంచు బిళ్ళలను విరగ్గొట్టడంలాంటి చిదుగుపనులు చేసేవారు. అప్పుడు చాల కోపం వచ్చేది.

గ్రామాలకు ఎద్దులబండిలో ఫోయి ఆట ప్రదర్శించటం ఎంతో సంబరంగా ఉండేది.

ఈ రోజు ఆ సంగతులను గుర్తుచేసుకుంటే ఎంతో దుఃఖం కలిగింది.

ఇంటికి రాగానే ఎద్దుల మెడలను కాడిమాను నుంచి విడిపించి, గాడిపాయ దగ్గర కట్టి మేత వేశాను.

కొద్దిసేపటి తరువాత వాటి ఒళ్ళు కడగటానికి పూనుకున్నాను.

రాయితో ఒళ్ళు రుద్దాను.

అప్పుడు దుఃఖం పొంగుకు వచ్చింది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

41