పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాళ్లు రాసిరి.

తెలుగుకోసం ఉద్యమించిన గడ్డ, తెలుగు ఉద్యమాల గడ్డ మా ఓసూరంటే అది అతిశయోక్తి కాదు.

నేను పదోక్లాసు ఫస్టుక్లాసులా పాసైంది మాత్రము మా వీది వాళ్లకి అతిశయోక్తి గానే వుంది. ఏలంటే నేను ఎబుడు చూసినా చేనుకి, చెట్టుకి తిరగతానే వుంటిని. ఇంగ ఇస్మూలుకి చక్కరు కొట్టి (డుమ్మా కొట్టి) తెలుగు ఫోరాటాలకి, తెలుగు సినిమాలు చూసేకి పోతా వున్నింది వాళ్లకి బాగా తెలుసు.

“పదిపనులు చేసేవాడు పదకొండో పని చేస్తాడు. నువ్వ సరిరా” అని రామన్న నన్ను మెచ్చుకొనె. అమ్మ నన్ను తబ్బుకొని చానా ఆనందము పడె.

వీళ్ల మెచ్చుకోలుని మెడమింద వేసుకొని పదకొండొ క్లాసుకి చేరితిని. కానీ ఆడ అసలుకత సురువాయ. ఏలంటే పదికి పైన క్లాసులు తెలుగులా చదివేకి మాస్ఫూల్లాలే. దాన్నింక ఇంగ్లీషు మీడియంకి చేరిండాను. రెండేండ్లు ఇంగ్లీషు చదువుల్లా మునిగి తేలి కడకి పెయిలై ఇంట్లో సోడ మొకము పెడితిని.

“నువ్వు పెద్ద చదువులు చదివి ఉద్యోగము చేసి, మమ్మల్ని సాక్కుంటే పోనీ పోయి సేద్యమే చేయి పోప్పా” ఇంట్లో అబ్బా అమ్మా అంటా వుండారు.

చదువా, 'సేద్యమా నా ముందర రెండు విషయాలు వచ్చి నిలిచిండాయి. నేను అవిటిల్ని (వాటిని) చూసి అంటిని “సేద్యము చేస్తా చదువుతా...” అని. “అదీ చూస్తాము " అని అనె. చూడాల్సింది మీరు కాదు. నేనే మిమ్మల్ని చూస్తానని నా పని నేను చేస్తా పోతిని.

చేనుతావ కానతావ, ఇంట్లో వీదిలా, బయిల్లా ఇట్ల ఏడపడితే ఆడ చదివితిని, కానీ నాకు ఆ ఇంగ్లీషు చదువులు బుర్రకి ఎక్కలే.

మనకి స్వాతంత్రము వచ్చి ఇన్నేండ్లు అయినా వాని బాస వాని బతుకు, వాని బుద్దులు, సుద్దులు అంటేనే ఇష్టము. ఇది చాలదని వాని మతము వూర్లాచేరి వూరి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తా వుంది. అంతా కర్మ కర్మ ఈ బుక్కులు వొద్దు ఆ చదువు వొద్దు అని ఆ బుక్కుల్ని పారేస్తిని.

“ఆ బుక్కులు పారేస్తే పారేస్తివి కాని ఇందా” అంటా కొన్ని బుక్కులు నా చేతికి ఇచ్చె నా సావాసగాడు శివన్న నా కంద్లని నేనే నమ్మలేదు. అవి పన్నెండోక్లాసు తెలుగు బుక్కులు.

“తిరుతణ్సి జిల్లాలా మా సొంతమోళ్లు వుండారు. ఆడనింకా తెప్పిస్తిని బాగా చదివి పరీక్షలు రాయిరా” అని చెప్పి పాయె.

ఆ ఏడాదే తెలుగులా పరీక్షలు రాస్తిని. పాసైతిని. కాలేజీకి చేరేదాంట్లో బెంగళూరు, సేలం, తిరుపతి ఇట్లా తిరగతా వుండా.

“రేయ్‌! నువ్వు ఇంగెట్లో కాలేజికి చేరతావు, తెలుగు మీటింగులకి, పోరాటాలకి వచ్చేకి అయ్యేలే. ఈపొద్దు మన ఆర్‌. వి.స్కూలు పెద్ద గ్రవుండలా ధర్మపురిజిల్లా తెలుగు మహాసభలు సురువు అవతా వుండాయి. సి.నా.రె. గారు, సినీమా యాక్టరు అక్కినేని నాగేశ్వరరావు గారు, రోజాగారు వస్తా వుండారంట పోదాము” అనె శివన్న నేను సరే అంటిని.

మేము పోయేతలికే పెద్దగా వేసిండే స్టేజి ముందర సుమారుగా ఐదువేల జనం వుండారు. నా సావాసగాళ్లు కొత్తగొండపల్లి రాజగోపాల్‌, క్రిష్టమూర్తి, వేణుగోపాల్ , రవీంద్ర, మురళి, మురుగేష్‌ ఉమేశ్‌ రెడ్డి, మురుగేషన్‌ని కూడ ఆడ కలుసుకొంటిని.

ఆ మీటింగులా మాట్లాడిన అక్కినేనిగారు, సి.నా.రె.గారు “మీ తమిళనాడుని ఏలతా వుండే కరుణానిధిగారు మాకు బాగా తెలుసు. ఆయప్ప తావ మీ తొందర్లు చెప్పి అవి తీరుస్తాము” అనిరి. చప్పట్లు కొడతా మేమంతా ఫొంగిపోతిమి.

“కోదండరామయ్య కాలమునింకా ఆంధ్రానింకా ఎందరు మినిస్టర్లు, సినిమా వాళ్లురాలే. వచ్చినవాళ్లంతా ఇట్లే మాట్లాడిరి. అయినా మనకి చేసిందేమీ లేదు” వెంటుకలు నరసిండే తాత అంటావుండాడు.

(తరువాయి వచ్చే సంచికలో...)


27వ పుట తరువాయి

పరివర్తించాలన్నమాట. పై మచ్చులో ప్రతినిధి అలాంటి ముఖ్యమైన పదం.

1. to abbreiate (ప్రత్యాహారముగా కల్సించు) 2. to abdicate-పద (పదవీ) త్యాగము చేయు 3. to abet - నేఱము చేయుటకై సహాయము చేయు 4. to abridge - క్లుప్తముగా చేయు 5. to abrogate - చట్టమును/ శాసనమును/ నిబంధనను/ఒప్పందమును రద్దుచేయు (పదం ముందు అ గానీ వి గానీ వాడండి) 6. to accelerate - వేగిరం చేయు, వేగవంతం చేయు, శీఘ్రతరం చేయు 7. acclimatize - ఒక వాతావరణానికి అలవాటు చేయు/అలవాటుపడు 8. to accommodate - విడిది ఇచ్చు 9. to conceptualize - మనసులో ఒక పరిభావననీ/ భావనని ఏర్పఱచుకొను 10. to complicate - సంక్షిష్టం చేయు 11. to condescend - ఇతరుల కంటే సర్వోత్తముడైనట్లు ప్రవర్తించు 12. to conscript - బలవంతంగా సైన్యంలో చేర్చుకొను, సైనికుడుగా చేసుకొను 13. to countersign - ఒకఱు ఇప్పటికే సంతకం చేసిన పత్రం మీద తాను మళ్లీ సంతకం చేయు (పదానికి ముందు ప్రతి అనే ఉపసర్గ చేర్చండి) 14 to debillitate - అశక్తం చేయు 15. to de-glacialize - హిమానీనదాలు లేకుండా చేయడం/ లేకుండా అవడం (అ-హిమానీ అనే పదాన్ని వాడండి)

ఈ క్రింది క్రియాధాతువులకి పదకుటుంబాల్ని నిష్పాదించండి:

1. వర్గీకరించు 2. సులభీకరించు 3. జటిలీకరించు 4. వలసీకరించు 5. పత్రీకరించు 6. విశదీకరించు 7. నిగూఢీ కరించు (to mystify) 8. వాహినీకరించు (to channelize) 9. నవలీకరించి (నవలగా వ్రాయు) 10. కవనీకరించు (ఒక ఆలోచనను కవిత్వంగా మార్చి చెప్పు) 11. తద్భవించు (సంస్కృతశబ్దం కాకపోయినా వినికిడికీ, వ్యాకరణ కార్యాలకీ ఆ విధంగా ప్రవర్తించు : ఉదాహరణకు సేకరణ అనే పదం) 12. వ్యాసీకరించు (ఒక ఆలోచనను వ్యాసరూపంలో రఛించి వ్యక్తం చేయు) 13. చిత్రీకరించు (to shoot) 14 క్రియాపించు (క్రియగా మార్చి వ్యక్తం చేయు) 15. సమీకరించు 16. తరూకరించు (పూర్వం ఇది, ప్రస్తుతం ఇది, పరం ఇది అని ఒకదాని కింద ఒకటి సూచిస్తూ ఒక చెట్టులాంటి పటాన్ని గీచు) 17. తటస్టీకరించు (to neutralize) 18 ప్రతీకరించు (పగ తీర్చుకొను) 19. శుద్దీకరించు (to purify) 20. పవిత్రీకరించు.

(తరువాయి వచ్చే సంచికలో...)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

4