పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుక్కా బతుకుతుంది, నక్కా బతుకుతుంది. మనిషీ బతుకుతాడు. ఏమి ఫలము. వీడు ఎబుడు చస్తాడ్రా అని అనిపించుకొని బతికేది ఏమిటికి? అది ఒగ బతుకేనా... ఇట్లా వాళ్లు బతికేది ఏమిటికి.. గతికేది ఏమిటికి.. యోచన చేయండ.

“మండలి వెంకట కృష్ణారావుగారు మొదటి తెలుగు ప్రపంచ మహాసభల్ని ఏర్పాటు చేసింటే దాంట్లో కలుసుకానె. 1984 జూన్‌ 4న హైదరాబాద్‌ కార్యాలయములా ఫోను ఎత్తుకొని “తెలుగు...తెలుగు” అనే మాట అంటా కోదండరామయ్య కన్నుమూసిరంట. వేలవేల తెలుగుజనం మనతావు తెలుగుజనం చేరి ఓసూరులా మన్ను చేసిరంట. మన్నులా నింకా వచ్చిన మనిషి తిరగా మన్నులాకే చేరిపాయె”. బోబుద్ది వుండేవోళ్లు, బుద్ధిలేని వాళ్ల మాటలు వినుకొని ఒగొగ మెట్టు గుడిమెట్టు దిగతా ఇంట్లోకి పోతిని.

ఇంగా ఎక్కాల్సిన మెట్లు ఎన్నుండాయో! నక్మాల్సింది (తినాల్సింది) ఎంతుందో! పెద్దోళ్లు చెప్పేది, చిన్నోళ్లు చేసేది. మంచి విన్నపము, చెడ్డ బుద్ధి, ఇస్మూలు పాఠాలు, వీది గుణపాటాలు, నన్ను సాకిన బావురపిల్లి, బాలాబిక్షం పెట్టిన పులి, కతలు చెప్పిన శెనిగి నక్క వెతలు విన్న బుడిగి నక్క, కష్టం విలువ కొలిచిన కాకన్న, నష్టం విలువ తనలా నింపుకొన్న నాగన్న, కాసుల వేటని... కసాయి మాటని, వింటా నేను, కంటా నేను, కాలంలా కలిసి కదలి పోతావుండాను. అబుడు నన్ను చూసి నగి (నవ్వి) రమ్మని పిలిచె ఇస్మూలు, సర్మారి ఇస్మూలు. రామ్‌ప్రకాష్‌ విజయలక్ష్మి హైయర్‌ సెకండరి ఇస్మూలు ఈ ఇస్మూలులా పదోక్లాసు నాది.

ఇస్మూలు బయట లోపల తెలుగు వినబడతా, కనబడతా వుంది. పచ్చని తెలుగుతోటలా మా ఇస్మూలు, తోట చుట్టూరా తన గమ్ములని గుమ్మరిస్తా నిలచిండే కన్నడమ్మ. తోటలా ఆడాడ అరవ మొలకలు.

అయితే ఏమి? తోట మాదే. తోట అంతా మేమే. మాదే పెద్ద గుంపు. పదో క్లాసులా నాది ఆ పొద్దు మొదలు దినము. ఇస్మూలు బెల్లు కొడతానే పోయి గ్రౌండ్లా నిలుచుకుంటిని.

“ఎవ్వని చే జనించు...” తెలుగుతల్లి ప్రార్ధన పాడినంక“ నీరారుం కడలుడుత్త” తమిళతల్లి ప్రార్ధన పాడినంక క్లాసుకి పోతిని.

మొదలు పిరియడ్‌ తెలుగు. చంద్రశేకర మాస్టరు వచ్చి తెలుగు పద్యము రాగము తీస్తా వుంటే... మేమంతా కిసిక్‌ మిసిక్‌ (సైలెంట్‌ గా) అనుకుండా వింటిమి. తెలుగుపద్యము గనత కనుగొంటిమి.

మా ఓసూరు తావులా ఊరికొగరు పద్యాలు రాసేవాళ్లు వీదికొగరు పద్యాలు పాడేవాళ్లు వుండారు.

నేను పెద్దవాడుగా అవుతా వుండాను.

మా ఓసూరు పెద్దదవుతా వుంది.

ప్యాక్టరీలకని చేనులిచ్చిన మాతావు రైతులు మాత్రం దినదినానికి చిన్నోళ్లె పోతావుండారు.

పాలు అమ్మతా ఒగరు. కూరాకు అమ్ముతా ఇంగొగరు. ఒగనాడు వూరిని సాకిన రైతులు, దేశానికి అన్నం పెట్టిన రైతులు. ఇబుడు అన్నానికి అలస్తా వుండారు.

ప్యాక్టరీలకి పనికి వచ్చిన దిగువసీమ వాళ్లు పెద్దోళ్లె దర్జాగా గాడీల్లా (టూ వీలర్స్‌) తిరగతా వుండారు.

ఇది కాలానికి తగినట్ల కోలాట కాదు. కాలంలా ఇదే కాలంలా మా కాలంలానే కుతంత్రాలు పన్నిన కొందరు కంత్రీల ఆట ఇది.

"రేయ్ చిన్నా ఈ తమిళాయమ్మ ఏమో అడగతా వుంది, నువ్వు వచ్చి అర్థం చెప్పు” అమ్మ అంటా వుంది.

ప్యాక్టరీలలా పనిచేసేకి వచ్చిండే తమిళులు మా వూరి చుట్టూ ఇండ్లలా బాడిగకు దిగిండారు. కొందరు చిల్లర అంగళ్లు పెట్టిండారు.

మా ఇంట్లో తమిళము మాట్లాడేకి ఎవరికీ వచ్చేలేదు. నేను పదోతరగతి చదవతా వుండా పెద్ద ఇస్మూలులా. దాన్నింకా నాకు తమిళము వస్తుందని అమ్మకి నమ్మకము.

ఏట్లో బాదపడి ఆయమ్మ కందిబ్యాళ్లు అడగతా వుందని అమ్మకి చెప్పితిని కాని నాకు మాత్రం తమిళం ఏం తెలుసు? ఎట్ల తెలుసు?

ఇంట్లో మాట్లాడేది తెలుగు, వీదిలా మాట్లాడేది తెలుగు, ఆడేది తెలుగు ఆట, పాడేది తెలుగు పాట, చూసేది తెలుగు సినిమా.

మా ఇంటి పక్మబా తమిళాయన చిల్లర అంగడి పెట్టిండాడు. ఆయప్పకి సరుకుల పేర్లు తెలుగుపేర్లు నేర్చేకి పోయి నేను తమిళం నేర్చుకొంటిని. కాని ఆ అప్ప ఒక తెలుగుమాటనూ నేర్సుకోలే. వాడు గుగ్గు నేను గొప్ప అని ఆపొద్దు అనుకొంటిని. వాడు కాదు నేను గుగ్గు అని తెలుసుకొనేకి నాకు చాన్నాళ్లు కాలే.

ఆపొద్దు మట్టమద్దేనము మబ్బులు ముసురుకొనిండాయి. ఆకాశములా పొద్దప్పని జాడ కానము (లేదు) పడీపడనట్ల వానచినుకులు. మమ్మలందర్ని కలస్తా కలపతా చల్లనిగాలి. గాలికి లేనిది, ఎండకు లేనిది, నేలకి, నిప్పుకి లేనిది మనిషికి మాత్రమే వుండేది, అదేమని మీకందరికీ తెలుసు కదా! అది మా క్లాసులా కొందరి చిన్నోళ్లకి చానానే వుందని ఈ నడమే నాకు తెలుస్తా వుంది. అబుడు కిష్టారెడ్డి మాస్టరు చరిత్రపాటము చెప్పేకి క్లాసులాకి వచ్చిరి.

“ఈ పొద్దు నేను పాఠాలు చెప్పేలే. మీరే మీ మనసుని కదలించిన లేదా మీరు దిగులు (భయం) పడిన విషయము గురించి నాలుగు మాటలు రాయండా” అనిరి.

మేమంతా పెన్ను పేపరు ఎత్తుకొని రాసి, ఒగొగరే మేము రాసింది చదవతా వుండాము.

మల్లిగాడు వచ్చి తాను రాసింది చదివె.

“నేను మొన్న మన ఓసూరు బస్టాండులా బస్సుకని నిలుచుకొని వుంటిని. అదెబుడు వచ్చేసెనో పెద్దపులి వచ్చి నా పక్కలా నిలుచుకొని వుండె. దాన్ని చూసి నాకు దిగులాయె”.

“ఆహా! ఏమి రాస్తివిరా, ఓసూరు బస్టాండు, ముందర మాదిరిగానా వుంది. ఎబుడు చూసినా వేయారుమంది జనం నూరారూ బస్సులు నిండిపోయి వుంటుంది. అట్లా జాగాకి వచ్చిన పులి నిన్ను కరిచి నోట్లో వేసుకోకుండా నిన్నే చూస్తా వుందా. అయినా ఇపుడు అడవుల్లానే పులులు లేవు కదరా, అట్లాతబుడు అదెట్ల ఆడికి వచ్చె. నీ రాతని చూస్తే నాకు నగువస్తుందిరా” అంటా నగిరి సారు.

మేము అంతా నగినగి పెట్టేస్తిమి. అందాతలికే పీను (ప్యూన్‌) ఒగ పేపరుకట్ట తెచ్చి మాస్టరికి ఇచ్చిరి.

“వచ్చే ఆయితారము మన ఆంధ్ర సాంస్కృతిక సమితిలా శ్రీకృష్ణదేవరాయల పట్టాభి షేకము జరుగుతుందంటా, అందరు ఫొండా” అని చెప్పి పోయిరి సారు.

ఆయితారము సొద్దిననే నేను నా సావాసగాళ్ల జతలా సమితికి పోతిని. ఓసూరుకి గుండెకాయ అట్లా జాగాలా వుంటుంది సమితి భవనము. సమితికి పోయే దోవ పొడువునా బేనర్లు కట్టిండారు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

38