పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుసుకోప్పా” అని చెట్టు నా చెవిలా చెప్పతా వుంది.

“తేటతెలుగు మాటలు అంటే మాకు చానా ఇష్టము. దాన్నింకానే మేమూ ఇంతకాలం పలికితిమి. మా బిడ్డలు కూడా అదే చేస్తారు. కాని మీరేల ఇట్ల చేసిరి. మీ బిడ్డలు ఏల తెలుగు బాసకి దూరమైరి” గువ్వమ్మలు గూటిపైనింకా అంటా వుండాయి.

వాళ్లు అనేదంతా నేను వింటా వుండాను. ఇంగా ఎంత వినాల్సి వుందో. ఈ కండ్లలా ఎంత చూడాల్సి వుందో. యోచన చేస్తా వుండా... ఆ యోచనలా అమ్మ గేణానికి వచ్చె.

“మూపుసారి వచ్చేతబుడు చేనుతాకి పోయి కట్టెలు తేప్పా” అని అమ్మ చెప్పిన మాట అట్లే తట్టె. ఇదే మాట కాకన్న తాతకి చెప్పి, నేను చేను తాకి పోతావుండా...

"బూలోకములా మనిషిగా పుట్టినంక వాని బాస వాడు చదవతా, వాని పని వాడు చేస్తా, వాని బతుకు వాడు బతికేకి అయ్యే లేదా? ఏలిట్ల, ఏడ తప్పు జరిగె, ఎవరు తప్పు చేసిరి, ఎవరో... ఏదో.. చేసిన తప్పుకి మాకు శిక్షనా? మాకు బాధలా” అనుకొంటా కట్టెలు ఏరి మోపు కడతా వుండా.

“తాయప్ప మాస్టర్నే కాదు, ఇంగా చానా జనము మాస్టర్లని, తెలుగు సంఘమోళ్లని జైలులా పెట్టి పోలీసులు బాగా కొట్టిండారంట, ఇది చానా అన్యాయమని వీళ్లంతా చేరి ఆంధ్రా సి.యం. తావుకి పోయి మా పరంగా ఒగ మాట మాట్లాడండ అని అనిరంట. దానికి ఆ పెద్దమనిషి మీరు తమిళనాడులా చేరిపొతిరి, అట్లాతబుడు మీరే అన్ని సరుసుకొని పోవాల, అది తెలుసుకోకుండా ఈడికి ఎగేసుకొని వస్తిరా, అని ఉమిసెనంటా, మనోళ్లకి పోలీసులు కొట్టిన వేటుల కన్నా ఆయప్ప మాటలు చానా జోరుగా తగిలి తలతిరిగెనంటా” అని పెద్దోళ్లు మానునీడలా మాట్లాడతా వుండారు. వాళ్ల మాటలు వింటానే నాకు అదో మాదిరిగా అయిపోయె. ఉసూరని ఆడే రవంతసేపు కూకొనేస్తిని.

“శీలంక తమిళుల గురించి, మన దేశంలాని, దేశాను దేశాలలాని తమిళుల గురించి తమిళసర్మారు కేంద్రసర్మారుని మూడు చెరువుల నీళ్లు తాపతా వుందే, అట్లాతబుడు తెలుగుసర్మారు మా గురించి ఒగ మాట మాట్లాడేకి ఏల కాలే” అంటా గోపన్న అనిన మాటల్ని గేణము చేస్తా కాకమ్మ పక్క చూస్తిని.

“ఒగ్గట్టు లేని జాతిరా మీది, మీ జాతికి నా జూటీ కొట్టా” అంటా నన్ని ఉమిసె.

మొదలే సుస్తు అయింటిని. ఆయమ్మ అట్ల ఉమిసేతలికి కళతప్పి కిందకి పడిపోతిని.

“ఉండావా... పోయేసిండావారా" అంటా చీమక్క దోమక్క వచ్చినన్ని కరిచిరి. అబుడు నేను కండ్లు తీస్తిని. మెల్లిగా లేచి కట్టెల మోపును తలపైన పెట్టుకొని ఇంటిదావ పడితిని.

“చింతలేని బతుకునా జీవాలది” ఆవుల్ని అదిలిస్తా మీసాల మామ అంటా వుండాడు.

“బూలోకములా ఛింత చేసే జీవి మనిషి ఒగడే. ఆ చింతే మనిషిని జీవాలనింకా తనీ (వేరు) చేసె” బోగొప్పగా బెగ్గిలన్న అనె.

“ఊ... ఊ.. ఆ చింతే మనిషిని మనిషిగా చూడకుండా చేసె. కులమతాలు పుట్టిచ్చి కొట్టుకొని చచ్చే మాదిరిగా చేసె” మేకల్ని తోలతా కిట్టన్న అనె.

“ఏలిట్ల చింతన చేసిరి, ఎవరీ చింతన చేసిరి " సీరామన్న అడిగె.

“ఒళ్లు వూనము కాకుండా బతికేకి, ఓసిగా (ఊరకే) నక్కేకి, కొందరు నాయాళ్లు కలిసి ఇట్లా చింత చేసిరి” సాకన్న చెప్పె.

“సత్యమైన మాట చెప్పితివినా... ఈ గుట్టు తెలీక, తెలిసినా తెలియనట్ల జనం నాటకం ఆడతా వుండారు” గట్టిగా అనె బొట్టన్న

“ఈ బూలోకములా మనిషి మనిషిగా బతకాలంటే ఇంగెందరు చావాల? ఇంగేమి చేయాల?” గుండప్ప గంట కొట్టినట్ల అంటా వుండాడు.

గుండప్ప దణిని (ధ్వని) రంగన్న విననట్ల వుండాడు. “చింతా చేసిన ఇబుడే సిద్దించు పరమపదవి” అని అంటా వుండాడు. అందరు అనిన మాటల్ని వినుకొంటా కట్టెలమోపు తెచ్చి జగిలిమింద వేస్తిని. యోచన పైన యోచన చేస్తా గుడితాకి పోయి మెట్లమింద కూకొంటిని.

“ఆ ఇస్మూలు, తెలుగు ఇస్మూలు. కోదండరామయ్య కాలములా కట్టింది. ఆ మేస్టరు, ఈ మేస్టరుకే కాదు మన తావులా చానా తెలుగు మేస్టర్లకి గవర్నమెంటు ఉద్యోగాలు వచ్చింది అబుడే. అంతేల, ఈ పొద్దు మన తావు రైతులు నీళ్లకి కొదవ లేకుండా పంటలు పండిస్తా వుండారంటే దానికి కారణము కోదండరామయ్య. కెలవరిపల్లి డ్యాం కట్టింది ఆయప్ప కాలములనే. ఓసూరులోని ఆంధ్ర సాంస్కృతిక భవనాన్ని కట్టించింది ఆయప్పే” అంటా గొప్పగా చెప్పతా వుండాడు చూడన్న.

“రాయలను ఆశ్రయించిన తొలి తెలుగుకవి ఎవరు? కృష్ణదేవరాయల కుటుంబము, మహాత్మాగాంధీ ఈ బుక్కులన్నీ ఆయప్ప రాసిండె. అంతేకాదు రాయల యుద్దవిజయము, పరిపాలన, సాహిత్యపోషణ, వంశము, భక్తి, దేవాలయ కైంకర్యాలు, జానకీపతి శతకము, అచ్యుతరాయ శతకాలు రాసిండె. కాని ఆయన పోయినంక అవి బుక్కులుగా లెక్కకి రాలే " బాదపడతా అనె కెంపన్న.

“ఓసూరు తావు ఆంధ్రాలా చేరాలని కంకణము కట్టుకొని తిరిగి, ఈ సమాచారాన్ని ఆంధ్రా పెద్దలతావ చెప్పి చానా తిరిగె. చానా బాదపడె. కాని తమిళనాడులానే నిలచిపోయె మన ఓసూరు. అట్లా తబుడు తను చేస్తా వుండిన సర్మారిమేష్టరు పనికి రాజీనామా ఇచ్చి మన తావునింకా ఎమ్మేల్యేగా నిలచి గెలచి అబుటి తమిళనాడు చట్టసభలా తెలుగువాణిని వినిపించి తెలుగు కోసరము పాటుపడె, ఆంధ్రాలా వావిలాల గోపాలయ్యకి మన కోదండరామయ్యకి చానా బందముంది. అది ఏమప్పా అంటే బాసాబందము, బాసాసేవ, నిండుతనము, నిరాడంబరము... ఇది మన అందరికి ఆదర్శమే.

ఈ ఆదర్శమే మన ఎమ్మెల్యే వెంకటసామన్నని తమిళనాడు చట్టసభలా తెలుగుమాట వినిపించే మాదిరి చేసె. మన తావు ఇంగో ఎమ్మెల్యే రాజారెడ్డిగారిని తెలుగుదండోరా వేపిచ్చి, తెలుగుకు జై కొట్టేలా చేసె. అట్లే ఆమీట ఎమ్మెల్యే అయిన గోపీనాథ్‌ ను తమిళనాడు చట్టసభలా తెలుగుతల్లి మీద ప్రమాణం చేసి చరిత్రకి ఎక్కే మాదిరిగా చేసె. ఇదే అభిమానమే ఎందరో తెలుగు అభిమానుల్ని తయారు చేసి ఇబుడికీ ఈడ తెలుగుకు జై కొట్టే మాదిరిగా చేసె” అని వీరముగా లేచె ఈరన్న.

అబ్బబ్బ ఎట్లా వాడప్ప మా కోదండరామయ్య. అందరూ కాలములా కలిసిపోతారు. ఈయన ఏమప్పా కాలమునే తనదిగా చేసుకొనిండాడు. “అది కోదండరామయ్య కాలము” అని జనం అంటా వుండారే. ఎట్లా ఘనమైన బతుకు ఆయనది. బతుకంటే ఇది కదా...

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

37