పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హోసూరు తావు నవల

అగరం వసంత్‌ 094883 30209


"సవరెయ్యి పొద్దులా తాయప్పమాస్టర్ని పోలీసులు అరెస్టు చేసిరంటా” అనే సుద్ది వూరువూరంతా మాట్లాడతా వుండారు. జనం గుంపులు గుంపులుగా జగిళ్లతావ గుదితావ చేరిండారు. ఇంకొందరు పోలీస్‌స్టేషన్‌కి పోయేకి సురువు అవతా వుండారు. నేనూ కాకన్నా తాతకూడా ఆవులు మేపేకని కావలి పక్మకు కదలి పోతిమి.

“ఏల తాతా తాయప్పమాస్టర్ని పోలీసులు అరెస్టు చేసింది” అంటా అడిగితిని.

“తరతరాలనింకా మన తావుల్లా వుండే ఇస్మూలుల్లా తెలుగు తల్లి ప్రార్ధన పాడేది వాడిక. ఈనడమ కొత్తగా సర్మారువాళ్లు తెలుగుతల్లి ప్రార్థనకి బదులుగా తమిళతల్లి ప్రార్థన పాడాలని రూలేసిరంట, దాన్ని ఎదిరిచ్చి తెలుగుసంఘమోళ్లు ఆర్భాటము చేస్తా వుండిరంట. ఆపొద్దు బుదవారము సంత కదా, ఈ విషయము సంతలాని జనాలకి తెలిసి గలాటాలు సురువు అయ్యి, అంగళ్లపైన వుండే తమిళబోర్జుల్ని పీకేసి, పోలీసులపైన రాళ్లేసిరంట. ఓసూరులా వుండే పోలీసుల చేతిలా గలటాలు అదుపు చేసేకి కాకుండా ధర్మపురినింకా పోలీసుల్ని పిలిసిరంట. వాళ్లు వచ్చే దోవలా జీపుకు ఆక్సిడెంట్‌ అయి దాంట్లో కొందరు పోలీసులు సచ్చిపోయిరంట. ఆ కోపమో ఇంగే కోపమో తెల్లేదు, తెలుగుమాస్తర్లని, తెలుగుసంఘమోళ్లని అరెస్టులు చేసి కేసులు పెడతా వుండారు” అనె.

నేను తమిళనాడులా వుండాను అనె సొరణ (స్పృహ) నాకు అబుడు కదా తట్టె.

“మన తావు తెలుగుతావు, పల్లెలంతా తెలుగు. ఇప్పటికీ చానా పల్లెల్లా ఒగే ఒగ తమిళ కడప కూడా లేదు. అట్లాతప్పుడు ఆంధ్రాలా కదా వుండాల్సింది. ఏల తమిళనాడులా వుండాము అని అడిగితిని.

“ఇపుటి తమిళనాడు, ఆంధ్రా, కర్నాటక ఇట్లా దక్షిణభారత దేశమంతా అపుడు మద్రాస్‌ స్టేట్‌లానే వుండె. అట్లాతబుడు మన తావులా తెలుగు ఓ వెలుగు వెలిగె. తాటి ఆకుల పొత్తాలు, పట్టుబట్టా నెమలిపించం రాతల్లా మెరసి నిలిచె. ఇండ్లు, అస్తి పాస్తులు, వూర్ల సమాచారాలు, కొండల చరిత్ర అంతా తెలుగే, ఇంగ్లీషువాని కాలంలా

సేలం జిల్లాలో మన తావు వుండె. అబుడు ఇంగ్లీషు సర్కారు వేసిన (ముద్రించిన) కాసుల్లా (నాణ్యాలు) తెలుగు -ఇంగ్లీషు రెండు బాసలు మాత్రమే వుండె. మనకి స్వాతంత్ర్యము వచ్చిన కొన్నేండ్లకి, మాకు వేరే తెలుగురాష్ట్రము కావాలని తెలుగన్నలు పోరాటము సురువు చేసిరి. దేశములా వుండే తెలుగుతావుల్లా అంతా కూడా గలాటాలు జాస్తి ఆయె. బళ్లారి, బరంపురము, మన ఓసూరులాను ఇంగా జాస్తిగా గలాటాలు ఆయె. దేశనాయకుడైన రాజాజీ పుట్టింది, పెరిగింది మన తొరపల్లిలానే, మన తాలూకాలానే. అట్లా నాయకుణ్ణి ఎదురించి ఫోరాడితిమి. ఎందరో జైలుకి పోయిరి, మన తావుల్లా వుండే నూరారు పంచాయితీలలా ఓసూరు ఆంధ్రాకి చేరాలనే తీర్మానాలు చేసిరి. అబుడు నాయట్ల వయసు చిన్నోళ్లంతా చేరి ఆంధ్రా వచ్చిస్తావుందని పండగ చేసుకొంటిమి. మదరాసు సర్మారు కూడా, ఇది ఆంద్రాకి చేరే తావే అని మత్తిగిరి కేటిల్‌పారంలా వుండే గొడ్డూ గోదానంతా మద్రానుకి సాగిచ్చిరి. అందాతలికే ఏమాయెనో మన ఓసూరు లేకుండానే ఆంధ్రరాష్ట్రము వచ్చిడిసె. 'రాజాజి చావాల... ఓసూరు ఆంధ్రాలా చేరాల” అని ఓసూరు వీదుల్లా పెట్ట పెద్ద అక్షరాలు రాసి కొందరు తిరగా గలాటాలు సురువుచేసిరి.

అబుడు సర్మారోళ్లు పటాస్మర్‌ కమిషన్‌ వేసిరి. వాళ్లు కొన్నాళ్లకి తమ రిపోర్టును సర్మారుకి ఇచ్చిరి. దాంట్లో, ఓసూరులా శానా పెద్ద గుంపుగా తెలుగువాళ్లు, ఆమీట కన్నడమువాళ్లు, కడగా తమిళులు వుండారు. ఇది మూడు బాసలు వుండే తావు, అని వుండే విషయాన్ని చెప్పకుండా ఏదేదో చెప్పిరి. ఆమీట సర్మారోళ్లు మెల్లిమెల్లిగా తెలుగు ఆర్బాటాన్నీ అణచిరి” కాకన్న తాత బాధగా అనె.

కాకన్న బాధని చూసి ఎండలకి కూడా బాగా మండినట్లుంది. బండలు పగిలే మాదిరిగా ఎండలు కాస్తా వుండాయి. నా ఒంట్లోనింకా చెమట చుక్కలు కారి నేలని నానపతా వుండాయి.

“నీ తావు గురించి అసలు విషయము ఏమని ఇపుడు తెలిసెనా పా” గుట్టన్న అంటా వుండాడు.

“ఆంధ్రరాష్ట్రము వచ్చినపుడు మిగిలిన మద్రాసు రాష్ట్రములా, అదే ఇబుడు తమిళనాడులా వెయ్యారు తెలుగు ఇస్ఫూళ్లు వుండె. ఇబుడయి నూర్లకి దిగిండాయి. ఆంధ్రాలా తెలుగుని ఇంగ్లీషు మింగతా వుంటే, బయట వుండే తెలుగు తావుల్లాని తెలుగుని తమిళము, కన్నడము, మరాటి, ఒరియా బాసలు మింగేస్తా వుండాయి. అది

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

36