పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

అడుగుజాడలు ఆనవాళ్తు-8

ఈమని శివనాగిరెడ్డి 98485 98446

నా అద్దంకి - ధర్మవరం యాత్ర

నేను అప్పటికే సగం ప్రయాణంలో ఉన్నా. ఎందుకైనా మంచిదని విద్వాన్‌ జ్యోతిచంద్రమౌళిగారికి ఫోన్‌ చేశా. ఆయన వెంటనే స్పందించి 'సార్‌ ఇప్పుడు ఉదయం 4:30 గం అవుతుంది. మీరు ఆరుగంటలకు రండి. మనం 7.00గంటలకల్లా ధర్మవరం వెళదాం. తరువాత అద్దంకి వచ్చి టిఫినుతిని, అద్దంకిలోని చారిత్రక కట్టడాలు, శిల్పాలు, శాసనాలను చూద్దామన్నారు. నేను అప్పుడే చిలకలూరిపేట దాటి మార్టూరు చేరువలో ఉన్నాను. ఈ సారి అద్ధంకీ, ధర్మవరం, మణికేశ్వరం, కుదిరితే దర్శి వెళతామని అనుకొంటున్నా ఇంతలో మేదరమెట్ల బోర్టు కనిపించి, అటు నుంచి ఇటు తిరిగి అద్దంకిబాట పట్టామోలేదో ఊళ్లో వాలిపోయి మళ్లీ చంద్రమౌళిగారికి ఫోన్‌ చేస్తే రాంనగరు సెంటరుకు రండి నేను ఐదునిముషాల్లో అక్కడుంటానన్నారు. ఆయన వచ్చిన తరువాత మసకచీకట్లోనే, కారులో ప్రకాశం జిల్లా మ్యాపు తెరచి, పోవాల్సిన ఊళ్లను ఒక సారి చూచుకొన్నాం. పొట్టి శ్రీరాములు సెంటర్లో అల్లంచాయ్‌తాగి మంచి ఉత్సాహంతో బయలుదేరాం. తెల్లటిగుడ్డలో నల్లటి చంద్రమౌళిగారు మెరిసిపోతున్నారు. మాచర్ల చెన్నకేశవుని వెండి మీసాలను పోలిన తన తెల్లటి మీసాలను సవరించుకొంటూ మురిసిపోతున్నారు. ఆయన తిరుపతి ప్రాచ్య కళాశాలలో ప్రాచ్యభాషలో మాస్టర్సు డిగ్రీ చేశారు.తెలుగు సాహిత్యంలో పీ. హెచ్‌.డీ. చేశారు. సాహిత్యాభిలాషతోపాటు, చరిత్రపై మమకారం పెంచుకొన్నారు. తిరిగేకాలు ఊరుకోదన్న సామెతను నిజం చేస్తూ, ప్రకాశం జిల్లా అంతాగాలించి, చరిత్ర పరిశోధకులుగా ప్రసిద్దులయ్యారు. 2004లో అద్దంకి చరిత్ర 2008లో ప్రకాశం జిల్లా దర్శనీయ స్థలాలు, 2019లో కొణిదెన చరిత్ర శాసనాలు, 2020లో ప్రకాశంజిల్లా ప్రాచీన చరిత్ర అంతకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో బౌద్దక్షేత్రాలు అన్న పుస్తకాల్ని రాసి, తాను విన్నంత, కన్నంతను ఉన్నంతలో నలుగురికీ పంచి పెట్టారు. “ధర్మవరంలో ఇనుప యుగపు సమాధులు నాశనమవుతున్నాయి. మీరొచ్చారంటే వాటిని ఎలాగైనా కాపాడుకోవచ్చు” అని నిన్నటి రోజునే నాకు ఫోను చేసినప్పుడు, వారసత్వ సంపద పరిరక్షణ పట్ల ఆయన ఎంత ఉబలాట పడుకున్నాడొ అర్ధమైంది. ఇదిగో వచ్చేస్తున్నానని ఊరించి, అనుకొన్నట్లుగానే అద్దంకి చేరిన నన్ను చూచి ఆయన ఎంత సంబరపడిపోయాడో. ధర్మవరం వైపు వెళుతున్నాం. సినీనటులు, ఆం.ప్ర. సాంసృతిక మండలి అధ్యక్షులుగా పని చేసిన ధర్మవరం సుబ్రహ్మణ్యంగారు, ఆరోజుల్లో నన్ను ఆయన ఆఫీసుకు పిలిపించుకొని, ధర్మవరం గురించిన చారిత్రకతను చర్చించుకొన్నాం. అద్దంకిలో ఎర్రాప్రగడ విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా నన్ను రమ్మన్నారు. ఆ తరువాత ధర్మవరం వెళదామన్నారు.ఆయనలేడు. అయినా ఆయన మాటలు వినబడుతూనే ఉన్నాయి. ఇంతలో ధర్మవరం చేరుకొన్నాం. చంద్రమౌళిగారు ముందుగా జైన దేవాలయానికి వెళదామన్నాను కాదు, విధ్వంసానికి గురౌతున్న ఇనుపయుగపు ఆనవాళ్ళను చూద్దామన్నాను. ఊరికి దక్షిణంగా మూడు కిలోమీటర్ల దూరంలోగల పాండవులమెట్ట అని పిలుచుకొనే ఒక కొండదగ్గర కారుదిగి, అప్పటికే కొన్ని వందల లారీల మట్టిని తోడుకెళ్లటంవల్ల ఏర్పడిన గుంటలగుండా నడుస్తున్నాం. బృహత్ధిలాయుగమని పిలువబడే ఇనుపయుగపు సమాధుల్ని కూడా, కోరపళ్ళ బకెట్టుతో నిర్ధాక్షిణ్యంగా ఎత్తి అవతల పారేసిన జేసీబీ కంటే, దాన్ని నడిపిన డైవర్‌ కంటే చరిత్రమీద ఏమాత్రం అవగాహనలేని రోడ్డు కాంట్రాక్టరు, ఆ ఇంజనీర్లమీద కోపంవచ్చింది. చెల్లాచెదురుగా పడిఉన్న నలుపు-ఎరుపు మట్టిపాత్రలు, ఎముకల ముక్కలు, అస్తవ్యస్థంగా విసిరివేయబడిన సమాధులచుట్టూ ఉండే గుండ్రటి బండరాళ్ళు విధ్వంసానికి గురై, రక్షించేవారు లేరా ఇటురారా అని మౌనపోరాటం చేస్తున్నాయి. కొండవాలుమీద అక్కడొకటి, ఇక్కడొకటి పది-పదిహేను గుండ్రంగా రాళ్లతో అమర్చిన సమాధులు మాసంగతేమిటిటంటూ దీనంగా చూస్తున్నాయి. 'సార్‌, పైకి తరువాత వెళ్లచ్చు. నిట్టనిలువుగా జరాసంధుడిని భీముడు చీల్చినట్లు ఈ సమాధిని జేసీబీ ఎలా భీభత్సంగా సగానికి సగం తెగ్గొట్టిందో చూడండి.” అన్నారు చంద్రమౌళిగారు. చనిపోయిన వ్యక్తి పుర్రె,ఎముకలగూడు, అతడు బతికుండగా వాడిన కుండ, అన్నీ సగానికి తెగిపోయి ఉన్నాయి. కళ్ళముందే చరిత్రకు గర్భస్రావం జరుగుతుంటే జీవశ్చవంలా నిస్సత్తుతో నిలబడ్డామే తప్ప నేనుగానీ, చంద్రమౌళిగారు గాని, మాతోపాటు వచ్చిన మరో ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు కడియాల వెంకటేశ్వరరావుగారు గానీ ఏమీ చేయలేకపోయాం. ఎలాగైనా ఈ విధ్వంసాన్ని ఆపమని చంద్రమౌళిగారిని కోరుకొని, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లమన్నాను. ముగ్గురమూ కలసి అక్కడున్న సమాధులన్నంటినీ పరిశీలించి, పదిలపరచాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని అనుకున్నాం. కొండవాలుపైన ఆరు అడుగుల పొడవు, ౩అడుగుల వెడల్పు, ౩ అడుగుల ఎత్తు గుంటలో చనిపోయిన వారి అస్తికలను, వారి పనిముట్లు, పాత్రలను వారితోపాటే పాతిపెట్టి, మట్టితోపూడ్చి, ఏవిధంగానూ, హానిజరుగకుండా భద్రపరచి, చుట్టుగుండ్రంగా రాళ్లను పాతి, కట్టడ కళకు 'ప్రాణంపోశారు క్రీ.పూ. 1000నాటి మానవులు.

ఒకచారిత్రక ప్రదేశాన్ని చూడబోతున్నామన్న ఆనందం కాస్తా చెదురుమదురుగా, చెల్లాచెదురుగా ఆనవాళ్లు కోల్పోతూ, చెరిగిపోతున్న తెలుగు వారి సంతకాలైన ఇనుపయుగపు సమాధుల్ని చూడగానే ఆవిరైపోయింది. నిరుత్సాహంతోనే ముగ్గురమూ, ధర్మవరంలో తూర్పుదిక్కున పోలాల్లోఉన్న శిధిల భీమేశ్వరాలయంపైపు వెళ్లాం.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

33