పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాషను నేర్చుకొవడం

జాన్‌ హోల్ట్

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?

నేనూ నా మిత్రులూ ఒకసారి ఒక స్నేహితుడింటికి వెళ్ళాము. వాళ్ళింట్లో ఓ ఆరునెల్ల పాప ఉంది. ముచ్చటగా ఉండే ఆ పాపని మేమంతా ఎత్తుకొని ముద్దాడాం. ఇక మేము మాటల్లో పడిపోయాం. ఆ పాపకు మా మాటల్లో ఏం కనిపించిందొ ఏమో మేం ఎవరం మాట్లాడితే వాళ్ళవైపుకు తిరిగేది. పరిశీలనగా చూచేది. తర్వాత కొంచెంసేపు తన బొమ్మని ఒళ్ళో పెట్టుకొని ఆడించేది. మళ్ళీ మా మాటల్ని వింటూ మావైపు చూచేది. మా మాటలు ఆ పాపకి అర్ధంగావని మాకు బాగా తెలుసు. మరి ఆ పాప ఏం గమనిస్తున్నట్టు? మా నుంచి ఏం నేర్చుకొంటున్నట్టు? బహుశః మా ముఖ కవళికలు, ఒకరి మాటలకు మరొకరం ప్రతిస్పందించే తీరు, నవ్వడం, హావభావాలూ ఆ పిల్లకి ముచ్చటేసి వుండొచ్చు. మాటాడ్డం అంటే శబ్ధాలు పలకడమేనా? భావాల్ని అందించడం, అందుకోవటం గదా! మాటలర్థం కాకున్నా ఆ పాపకు మా మాటల్లోని ఈ భావ వినిమయ క్రమంలో ఏదో తనక్కావల్సింది ఉన్నట్టుంది!

ఇలా పెద్దలు మాట్లాడుకొనేపుడు పిల్లలు ఎంత సేపైనా ఓపిగ్దా వింటుంటారు. మనం పిల్లలకి మాట్లాడ్డం నేర్ప్చించాలనుకొంటే మనమూ వాళ్ళతో ముచ్చట్లాడాలి. ఈ మాటాడ్డం సహజంగా, ఆ పిల్లల ముచ్చటకు భంగం కలిగించకుండా ఉండాలి. మనం పెద్దలం మాట్లాడు కొనేపుడు పిల్లలు వింటూ ఉంటే విననివ్వాలి.

నాకు తెలిసిన మరో పాప ఉండేది. వాళ్ళమ్మ ఓ పండ్ల దుకాణం నడుపుతుండేది. తన ఏడాది వయస్సు గల పాపనూ దుకాణంలోకి తీసుకొస్తుండేది. తల్లి తన పనిలో తాను మునిగిపొయ్యేది.

ఆపాప ఏదో ఒకదానితో ఆడుకొంటూ ఏదో ఒకటి గొణుగుతూ ఉండేది. ఒకసారి నేనా పాపను పరిశీలనగా చూస్తుండగా ఉన్నట్టుండి బెంగోగో బెంగోగో! అని రాగాలు తీయసాగింది. కొంచెం సేపు రాగం ఆపెయ్యడం మళ్ళీ అదే రాగం తియ్యడం నేను ఎంతో సేపు ముచ్చటగా చూశాను.

మరో 8 నెలల పాప 'లీడీ లీడీ లీడీ లీడీ అంటూ అదేపనిగా గొణగడం చూశాను. ఈ శట్టాలు ఈ పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకొన్నారు? ఎవరిని అనుకరించి పలుకుతున్నారు? ఇవి అనుకరించి నేర్చుకొన్నవి కాదు. నాలుకని అంగిటకి తగిలించడం తియ్యడం లాంటి ఏదో చేష్ట చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి అలాంటి ధ్వని వచ్చి వుంటుంది. అదే ఆటగా ఆ పిల్లలు ఆ ధ్వనులు చేస్తుంటారు.

దీన్నిబట్టి మనకేం తెలుస్తుంది? పిల్లలు మొదట అనుకరించి ధ్వనుల్ని నేర్చుకోరు. పసితనంలో వాళ్ళు ధ్వనుల్ని సృష్టించుకొంటారు. తయారుచేసుకొంటారు. కొత్త ధ్వనుల్ని కనుక్కొంటారు. తర్వాత మాత్రమే మన మాటల్ని అనుకరిస్తారు.

ఈ ధ్వనులకి అర్థం ఏమిటి? అర్ధం మనకు తెలీక పోవచ్చుగానీ ఏవో అనుభూతులు, కోరికలు, అర్జాలు మాత్రం వాటిలో దాగి ఉన్నాయి. అంటే వాళ్ళు మాట్లాడ్డం కోసం ప్రయత్నిస్తున్నారన్న మాట. మాటాడ్డం నేర్చుకొంటున్నారన్న మాట.

ఒక కృత్యాన్నీ ఆ కృత్యం చెయ్యడంలోని నైపుణ్యాన్ని మనం విడదీసి చూడలేం. అలాగే పిల్లలు కూడా భాషా నైపుణ్యాల్ని నేర్చుకొని తర్వాత భాష నేర్చుకోరు. మాట్లాడుతూనే వాళ్ళు మాట్లాడ్డం నేర్చుకొంటారు.

మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వల్ల కొన్ని చర్యలు జరుగుతుండటం పిల్లలు గమనిస్తుంటారు. ఈ మాటలకీ చర్యలకీ సంబంధం ఏమిటో వాళ్ళకి తెలీదు. కానీ తామూ ఆ మాటల్లో భాగస్వాములు కావాలని పిల్లలకి కోరిక తమ మాటల (ధ్వనుల) వల్లా ఇలా చర్యలు జరగాలని వాళ్ళ పట్టుదల. కానీ తమ మాటలకి అలాంటి శక్తి లేదని ఒకటి ఒకటన్నర సంవత్సరాల వయసు పిల్లలకి అర్ధమైపోతుంది. తాము ఇస్తున్న సమాచారం అవతలి వ్యక్తికి అందడం లేదని తాము చాలా పనులు చెయ్యలేనట్టే మాట్లాడ్డం కూడా చెయ్య లేకపోతున్నామని రెండేళ్ళ పిల్లలు బాగా గుర్తించేస్తారు. మరోవైపు వాళ్ళ “అవసరాలు” పెరుగుతుంటాయి. వాటన్నిటినీ వ్యక్తం చేసుకోవాలి. మాటలు తప్పనిసరి అవుతాయి.

ఓ కొత్త శబ్దం పలకాలంటే, గుర్తుంచుకోవాలంటే ఎంత కష్టమో మనం విదేశీ భాష నేర్చుకొనేప్పుడు చూస్తున్నాం. మన పెదాలు, నాలుక, దవడలు, గొంతు ఇలా స్వరయంత్రమంతా ఈ కొత్త భాష కనుగుణంగా చలించేందుకు నానా అవస్థలు పడతాయి.

కానీ ప్రతి బిడ్డా తనకవసరమైన, తన పరిసరాల్లోని భాషను నేర్చుకొంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు భాషలు కూడా పిల్లలు నేర్చేసుకొంటున్నారు. ఇన్ని ధ్వనుల్ని శబ్ధాల్ని సమన్వయం చేసుకోవడం పెద్దలకే ఇంత కష్టమే, పిల్లలకెలా సాధ్యమవుతోంది?

దీనికొకటే సమాధానం. ఓపిగ్గా ఏమాత్రం విసిగి పోకుండా పట్టుదలగా ప్రయత్నించడం వల్లనే ఇది సాధ్యమవుతోంది. వేల పర్యాయాలు ధ్వనుల్ని శబ్ధాల్ని పదాల్ని తన చుట్టూ ఉన్నవారి నుంచి విని పోల్చుకొని, తన ధ్వనుల్ని మాటల్ని ఇతరులకు సన్నిహితం చేసుకొంటూ వాళ్ళు భాష నేర్చుకొంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైంది ఏమంటే ఎంతో బాగా మాట్లాడాలనుకొనే ప్రయత్నంలో ఎన్నో తప్పులు చేస్తూ చేస్తూ వాళ్ళు నేర్చుకొంటున్నారు.

అలా గాదనుకోండి. మనవే ఈ మాటాడం అంతా నేర్చించేందుకు నడుం బిగించామనుకోండి. ఏం జరిగేది?

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

23