పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాట ఆమ్బీబస్‌ నుండి పుట్టింది. మందిని తీసుకొని వెళ్లేది అని తెల్లం. పేరు అంటే మందికి మరోమాట. ఎర్రాప్రగడ ఈ మాటను వాడినారు. పేరును తీసుకొని వెళ్లేది.

17.పోరు+ఏగి ఫోరేగి వార్‌టాంకర్‌. .......
18. మంట+ఏగి మంటేగి ఫైరింజన్‌ అగ్నిమాపక వాహనం అంటున్నారు.
19.మిన్ను+ఏగి మిన్నేగి రాకెట్‌ మిన్నుకు ఏగేది
20. సరకు+ఏగి సరకేగి లారీ.

“తమ్ముళ్లూ, పైన ఎన, ఏగి చేర్పులతో ఇచ్చిన మాటలలో కొన్ని నేను పుట్టించినవి కావు. బొదన్‌ బడిపిల్లలు పుట్టించినవి. ఆ పిల్లల పేర్లు నాకు తెలియదు. పిల్లలకూ వాళ్ల పంతులమ్మ అయిన శౌరీలమ్మకూ మనమందరమూ మప్పిదాలను చెప్పాలి” అన్నాను.

“మంచిమాట చెప్పినావు అన్నయ్యా. మరి శౌరీలమ్మ అప్పుడే ఈ మాటలను బయటపెట్టి ఉండవచ్చు కదా” అన్నాడు నారాయణ.

“శౌరీలమ్మ వాటిని బయటపెట్టాలనే అనుకొనింది. అప్పుడు కొన్ని నెలలపాటు నడుస్తున్నచరిత్ర రాలేదు. అమ్మనుడి ఇంకా అప్పటకి మొదలుకాలేదు. అందుకని తెలుగుకోసం నడుముకట్టుకాన్న తెలుగువెలుగు అనే నెలాకిక(మాసపత్రిక)కు పంపింది. అందులో అచ్చయినాయి”. చెప్పినాను.

“నిక్కంగానే తెలుగు కోసం నడుము కట్టుకొన్న ఆకిక కదా అది” అన్నాడు చిన్నయ్య.

కావచ్చు, ఆ నెలాకిక వాళ్లదే ఒక నాదాకిక(దినపత్రిక) కూడా ఉంది. అందులో ఒకసారి ఎలెక్టసిటీ ట్రాన్స్‌ఫార్మర్‌కు నియంత్రిక అనే పేరును పుట్టించి వాడినారు. దానిని చదివి పారుపల్లి కోదండరామయ్య అనే ఆయన నాకు పలుకిచ్చి(ఫోనుచేసి)నారు. ఆయన మించిడుపు(ఎలెక్టసిటీ డిపార్ట్‌మెంట్‌ )లో వంచ మరమరి(చీఫ్‌ ఇంజినీర్‌)గా పనిచేసినవారు. ట్రాన్స్‌ఫార్మర్‌ అంటే నియంత్రించేది కాదని మార్చేదనీ, దీనికొక తెలుగుపేరును చెప్పమనీ, ఆ ఆకికవాళ్లకు తెలియచేస్తాననీ అన్నారు. ఈర్చేది ఈర్పెన అయినపుడు, మార్చేది మార్పెన అవుతుంది. కాదూ కూడదూ అది నియంత్రిస్తుంది అని వాళ్లు అంటే నియంత్రికకు తెలుగుమాట అదుపెన అవుతుంది అని చెప్పినాను. పారుపల్లిగారు ఆ అకికకు ఇదంతా విడమరచి చెపుతూ ఒక కమ్మను రాసినారట. కమ్మ ఏమయిందో, నియంత్రిక అలాగే ఉంది. నన్నయ నుండి చిన్నయ వరకూ సాగిన సంసుక్రుత మాటలు చొప్పింత, కొన్నేళ్లపాటు ఆగింది. దానిని తెలుగు పేరోలగం(అకాడేమీ) వారు మరికొన్నేళ్లు సాగించి చాలించుకొన్నారు. ఇప్పుడు ఆ పనినీ ఒక నాదాకిక తలకెత్తుకొని మోస్తున్నది. ఎన్నాళ్లు మోస్తుందో చూద్దాం” అంటూ ముగించినాను.

(తరువాయి వచ్చే సంచికలో...)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

22