పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపొందించండి వర్గపరంగా, రక్తం మరియు రంగులో భారతీయులూ, కానీ రుచి అభిప్రాయాలు, నైతికత, తెలివితేటలలో ఇంగ్లీషు వారిగా ఉండాలి, వాళ్లనే బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ వర్గాన్ని ఉపయోస్తూ అనేకమంది శ్రమను దోచుకున్నారు. భారతీయులను బానిసలుగా మలిచారు. ఇంగ్లీషు భాషను ఎర చూపి ఈ వర్గానికి భారతీయత అనే భావన లేకుండా చేశారు. దేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టారు.

ఇంగ్లీషు భాషా వ్యాప్తికి ఆర్థిక కారణాలు:

బ్రిటీషువారికి తమ వ్యాపారం విస్తరించాలన్నా, రాజకీయంగా దేశాన్ని నియంత్రించాలన్నా భాష ముఖ్య సాధనంగా నిలిచింది. తమకు తెలియని భారతీయ భాషలు నేర్చుకొని వ్యాపారం కొనసాగించడం కష్టమని భావించి, భారతీయులను అనేకమందికి తమ భాష నేర్పించి శ్రామిక వర్గాన్ని తయారుచేసుకొన్నారు. ఇంగ్లీషు భాషా వ్యాప్తి బ్రిటిష్‌వారి వ్యాపార వ్యాప్తికి సారూప్యతను కలిగి ఉంది. దోపిడీకీ, రాజకీయ నియంత్రణకూ భాషే ఆధారమైంది. భారతీయులకు పాఠశాలలు స్థాపించి ఇంగ్లీషు భాషలో విద్య నేర్పించడాన్ని తమ అక్రమార్జనకు పెట్టుబడిగా భావించారు. భారతదేశ సంపదను వారి దేశానికి ఎగుమతి చేయడానికి ఇంగ్లీషు భాషను ఒక వాహనంగా వాడుకున్నారు.

భారతదేశంలోని ఎగువ మధ్యతరగతీ, మధ్యతరగతీ వర్గాలు బ్రిటిష్‌ ప్రభుత్వానికి పని చేయడం వలన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న ఆశతో ఇంగ్లీష్‌ నేర్చుకోవడం ఆరంభించారు. ఆనాటి భారతీయులకు ఇంగ్లీషు నేర్పించడం ఈస్టిండియా కంపెనీ నియంత్రణలోనే ఉండేది. 19వ శతాబ్దం నాటి ఎగువ మధ్య తరగతీ, మధ్యతరగతీ భారతీయులు ఉద్యోగాలు చేసుకోవడం వల్ల తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, చక్కటి జీవన విధానం ఏర్పడుతుందన్న ఆశతో తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలకు పంపించేవారు. బ్రిటిషు పాలకులతో ఇంగ్లీషులో మాట్లాడమే గొప్పగా భావించేవారు.

బ్రిటిష్‌ ఇంగ్లీషు విద్య - స్వతంత్ర భారతదేశంపై ప్రభావం:

బ్రిటిష్‌వారు అందించిన ఇంగ్లీషు విద్యను ఒక భాషా కోణంలో మాత్రమే చూడకూడదు. మన దేశ ఆచారాలనూ, సంస్కృతినీ, దేశీయ సాహిత్యాన్నీ మరుగుపరిచే విధంగా - పాశ్చాత్య విద్యను అమల్లోకి తీసుకువచ్చారు. భారతీయ భాషలలో వ్రాయబడ్డ మన సాహిత్యాన్నీ అధ్యయనం చేయడానికి తావు ఇవ్వలేదు. మన భావాలను మన భాషల్లో వ్యక్తీకరించడానికి ఆనాటి విద్యలో అవకాశం కల్పించలేదు. మన నీరు తాగుతూ, మన ఆహారాన్నీ తింటూ, మన నేల మీద ఉంటూ, యూరోపియన్ల సాహిత్యమూ, వారి కళలనూ, శాస్తాలనూ అభ్యసింపచేశారు. స్థానికంగా మనకుండే సమస్యలూ, కళల మీద అధ్యయనం కొరవడింది. పూర్తిగా మన దేశం యొక్క స్థితిగతుల మీద అవగాహన లేకుండా ఆనాటి విద్య పెడదొవ పట్టించిందనే చెప్పాలి. కాలక్రమేణా మన దేశ భాషల స్థానే న్యాయస్థానాల్లోనూ, ఇతర అధికార కార్యకలాపాలలోనూ ఇంగ్లీషుతో భర్తీ చేశారు.

73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ వాటి నీడలు అలాగే నిలిచిపోయాయి. బ్రిటీష్‌ వారు పరిపాలించిన అన్ని దేశాల్లోనూ విద్యా రంగాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమంగా ఉంటోంది. ఆర్థిక దోపిడీ నుంచి అన్ని దేశాలూ బయట పడుతున్నా బ్రిటీషువారు వదిలి వెళ్లిన భాషను మాత్రం విద్యా రంగంలోనూ, అధికార కార్యాలయాలనూ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆనాడు ఈస్టిండియా కంపెనీ వారు విద్యను నియంత్రించే స్థాయిలో ఉంటే - ఈనాడు విద్యా మాధ్యమంలో ఏ భాష ఉండాలనేది ప్రైవేటు కంపెనీలూ, మార్కెట్లూ నిర్ణయించే స్థాయిలోకి వచ్చింది. విద్య పూర్తిగా వ్యాపారమయమై. పోయింది. ఇంగ్లీష్‌ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అనే భ్రమలోకి నేటి సమాజాన్ని తీసుకెళ్లారు.బ్రిటీషు కాలంలో వారికి పనిచేసిన వారిలాగే, రక్తంలోనూ, రంగులోనే భారతీయులుగా ఉంటూ, భావాలలోనూ, నైతికతలోనూ, తెలివితేటల్లోనూ ఇంగ్లీషు వారిగా నేటికీ మన సమాజంలో చదువుకున్నవారు ఉండటం శోచనీయం. ఇంగ్లీషు నేర్చుకుని బ్రిటిష్‌ వారికి సేవ చేసి ఆర్థికంగా లాభపడాలని ఎగువ మధ్యతరగతీ, మధ్యతరగతీ వర్గాలు ఆనాడు ఏ విధంగా అయితే అనుకున్నాయో, నేడు కూడా నేర్చుకున్న ఇంగ్లీషు విద్యతో విదేశాలకు వెళ్లి వారికి సేవ చేసి ఆర్థికంగా బలపడాలని ఆలోచిస్తూ పనిచేస్తున్న వారూ ఉన్నారు. అయితే, ప్రపంచంలోని సమాచారం, సాహిత్యం ఎక్కువగా ఇంగ్లీష్‌ భాషలో ఉండటం వలన వాటిని అభ్యసించడానికి, జ్ఞానార్జనకు ఇంగ్లీషు భాషలో చదువుతున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఇంగ్లీషు ప్రధానాధారం అని ఇంగ్లీషు మాధ్యమంలో చదువుతున్నారు. కానీ నేడు అభివృద్ది చెందుతున్న కృత్రిమ మేథతో (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) యంత్రానువాద సహాయంతో ఒక భాష నుంచి అనేక భాషలకు అనువాదం జరుగుతున్న ఈ కాలంలో జ్ఞానార్జనకు భాష అడ్డుగోడగా ఉంటుందనడంలో నిజం లేదు. ఇక భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు పొంది పనిచేస్తున్న వారిలో ఇంగ్లీషు భాషలో నిష్టాతులై, దానిని ఉపయోగిస్తూ సంపదను సృష్టించడమూ లేదు.

మూడు భాషల సూత్రం:

స్వాతంత్రానంతరం అప్పుడే వలసవాద నీడల నుంచి బయట పడుతున్న సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1968 లో భాషా సమూహ గుర్తింపునూ, జాతీయ ఐక్యతనూ దృష్టిలో ఉంచుకొని, పరిపాలనా సామర్థ్యం లక్ష్యంతో మూడు భాషల విధానాన్ని అమలు చేశారు. ఈ మూడు భాషల సూత్రం ప్రాంతాలను ఆధారంగా చేసుకొని రూపొందించినట్టుగా కనిపిస్తుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీషు మరొక ఆధునిక భారతీయ భాషను ఉపయోగించాలనీ, హిందీ యేతర రాష్ట్రాల్లో స్థానిక భాష ఇంగ్లీషూ, హిందీ భాష ఉండాలని సూచించింది. తమిళనాడు రాష్ట్రం హిందీ భాషను బలవంతంగా రుద్దడం ఖండించి, మూడు భాషల సూత్రాన్ని వ్యతిరేకించారు. చివరకు మూడు భాషల సూత్రం దేశంలో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

14