పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యామాధ్యమం

జె.డి.ప్రభాకర్‌ 8500227185

విద్యామాధ్యమంపై వీడుతున్న వలసవాదపు నీడలు

సమాజంలో ప్రజలు స్థానికంగా అమ్మనుడులను పలుకుతూ జీవనం సాగించే సహజ వాతావరణంలో ఇతర బాషలు ఉపయోగించే సందర్భాలు కలగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒక ప్రాంతానికి పక్కనే వేరొక భాషా సమూహం సరిహద్దులు పంచుకున్నప్పుడూ, ప్రకృతి వైపరీత్వాలూ, వలసలూ, వ్యాపారాలూ మొదలగు కారణాలచేత ఒక భాషా సమూహం వారు మరొక భాష నేర్చుకునే పరిస్థితులు నెలకొంటాయి. అలా కాకుండా వ్యాపారం పేరుతో దేశాలను రాజకీయ చతురతతో దురాక్రమణ చేసి, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల శ్రమశక్తిని దోచుకుంటూ, అధికారాన్ని విస్తరింప చేస్తూ వారి భాషనూ, సంస్కృతినీ, మతాన్నీ ఇతరులపై బలవంతంగా రుద్దే క్రమం 15వ శతాబ్దంలో యూరోపియన్లు ప్రారంభించారు. మన భారతదేశంలో ఈ వలసవాదం 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. చరిత్రకారుడు ఫిలిప్‌ హాఫ్మన్‌ చెప్పినట్లు 1914 సంవత్సరం నాటికి బ్రిటిష్‌ వలసవాదులు 84 శాతం భూగోళాన్ని దమననీతితో ఆక్రమించారు.

ఆచార సంస్కృతులలో మార్పులు:

వలనవాదానికి గురైన అనేక ప్రాంతాలూ, దేశాలూ వారి ఆచారాలూ, కట్టుబాట్లూ, సంస్కృతీ, సంపదా, భాషలూ సంకట స్థితిలోకి వెళ్లాయి. మొదట, బ్రిటిష్‌ ప్రభుత్వంలో ముఖ్యులైన వారెన్‌ హేస్టింగ్స్‌ మతమూ, సామాజిక ఆచారాల విషయాలలో జోక్యం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో “ప్రతి సమాజంలో దాని సహజ చట్టాలూ, దాని ఆచారాలూ, అభ్యాసాలూ ఉన్నాయని, వాటిని కొనసాగించడానికి అనుమతించాలి” అని ఆదేశించారు. 1781 లో మొహమ్మడన్‌ కాలేజ్ 1782 లో హిందూ కాలేజీలను స్థాపించి, మన దేశం యొక్క సాహిత్యమూ, చట్టమూ, మతాన్నీ పరిరక్షించాలని ఆదేశించారు. కొద్దికాలంలోనే, అంటే జూలై 10వ తారీకు 1800 సంవత్సరంలో కాలేజ్‌ ఆఫ్‌ ఫోర్ట్‌ విలియంని బ్రిటిష్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ స్టాపించి- ఓరియంటల్‌ భాషలపై దృష్టి కేంద్రీకరించారు. భారత దేశంలో ప్రజల సాంఘిక మరియు సాంస్కృతిక జీవితంలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోని బ్రిటిష్‌ విధానం- 1813 తరువాత గణనీయమైన మార్పుకు గురైంది. పారిశ్రామిక విప్లవం రూపంలో ఇంగ్లాండ్‌లో జరిగిన భౌతిక మార్పు దీనికి ప్రధాన కారణం. ఈ మార్పులో భాగంగా, బ్రిటీష్‌ ఇండియా యొక్క అన్ని అధికార పరిధులలో సతి ఆచారాన్ని నిషేధించిన బెంగాల్‌ సతీ రెగ్యులేషన్‌ 1829 డిసెంబర్‌ 4 న అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ విలియం బెంటింక్‌ ప్రేరణతో ఆమోదించడం జరిగింది. సతీ సహగమనం మానవ స్వభావం యొక్క భావాలకు విరుద్దం అని నియంత్రణ విధించింది. బాల్య వివాహాలు కూడా 19 వ శతాబ్దపు భారతదేశంలోని మరో దురాచారం. భారతీయ సంస్కర్తలు కేశవ్‌ చంద్ర సేన్‌, బిఎమ్‌ మలబరి ఈ పద్దతిని భారతీయ సమాజం నుండి నిర్మూలించడానికి కృషి చేశారు. స్త్రీ శిశుహత్యలు మరొక అమానవీయ పద్ధతి. దాన్ని కూడా అరికట్టడానికి బ్రిటీషువారు 1795, 1802, 1804 తరువాత 1870 లో ఈ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించారు. అయినప్పటికీ భారతదేశంలో ఉన్న సంఘ సంస్కర్తలైన మహాత్మ జ్యోతిబా పూలే, రాజా రామ్మోహన్‌ రాయ్‌, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగువారు భారతదేశంలోని సతీసహగమనమూ, బాల్య వివాహమూ, అస్పృశ్యతా వంటి సామాజిక దురాచారాలను అధ్యయనం చేసి వాటికోసం స్థానిక భాషలలో ప్రజలను విద్యావంతులను చేసి వీటిని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు.

బ్రిటిష్‌ పరిపాలనలోని విద్య - అర్థిక దోపిడి:

వ్యాపారం చేసుకోవడానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో బ్రిటీషు వారు భారత దేశంలోకి అడుగుపెట్టి, క్రమేణా భారతీయులకు విద్యను అందించడానికి గల ప్రధాన కారణం- ఆర్థిక లాభాలను ఆర్జించడానికే అని చెప్పవచ్చు. ఇక్కడ భారతీయులను బానిసలుగా చేసుకుని వారి శ్రమను దోపిడీ చేసి, తద్వారా సంపదను భారతదేశం నుండి తరలించి, తమ దేశానికి ఎగుమతి చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. 1.వ్యాపారం విస్తరింపచేయడానికీ, 2.దేశంలో ఉన్న ప్రజలందరినీ రాజకీయంగా పరిపాలించడానికీ, 3.బ్రిటిష్‌ ప్రభుత్వానికీ భారతీయులకూ మధ్యవర్తులుగా పనిచేసే ఒక వర్ణం కావాలని భారతీయులకు విద్య నేర్పించడం జరిగింది. కైస్తవ మిషనరీల సహాయంతో ప్రైవేట్‌ పాఠశాలలనూ మరియు ప్రభుత్వ పాఠశాలలనూ ఏర్పరిచారు. బాంబే ప్రెసిడెన్సీలో, మౌంట్‌స్టూవర్డ్‌ ఎల్సిన్‌స్టోన్‌, 1827లో గవర్నర్‌గా ఉన్నప్పుడు, భారతీయులకు చదువు మాతృభాషలో కల్పించాలని బొంబాయి ఎడ్యుకేషన్‌ సొసైటీని ప్రోత్సహించారు. మాతృభాష ద్వారా పాశ్చాత్య శాస్త్రం మరియు జ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించడానికి అనేక జిల్లా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. అయినప్పటికీ చాలా మంది ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా ఉండాలని కోరుకున్నారు. అయితే బాంబే ప్రెసిడెన్సీ విద్యావిధానం స్థానిక భాషలకు విరుద్ధంగా ఉండడంతో ఈ నిర్ణయం వివాదానికి తెరలేపింది. ఇంగ్లీష్‌లో చదువుకున్న వారికే కొలువుల్లో పనిచేయడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. వారి ప్రభుత్వం కోసం పనిచేసే వారిని ఎంపిక చేసుకోవడం మెకాలే మినిట్‌ అన్‌ ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ 1885 లో పేర్కొన్నట్టుగా “మనకూ, మనం పరిపాలించే లక్షలాది ప్రజలకూ మధ్య వ్యాఖ్యాతలుగా ఉండే వర్గాన్ని

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

13