పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉషస్సుషమ

ix

యుత్తరాంధ్రకవుల వలె దక్షిణాంధ్రకృతుల నెఱుఁగఁ డనుకొందును. శ్రీ కురుగంటి సీతారామయ్యగారు రంగాజమ్మ కృతిని బ్రశంసించుచు నది 'అబ్బయామాత్యుని యనిరుద్ధచరిత్ర కంటె సర్వవిధముల మే లని చెప్పుటకుఁ దగినదై యున్న' దని వక్కాణించిరి. రంగాజమ్మ కృతి ముక్కుమొగ మెఱుఁగకయే మఱియొకరు, సందు దొరకినఁ జాలు మగకవుల నెగతాళి చేయువా రా మాట పట్టుకొని, యింకను నొక్కి వక్కాణించినారు. ఎవరి ప్రవృత్తికి సన్నిహితమైన కథపట్టున వా రొకరి నొక రతిశియించిరి. అంతమాత్రమున నట్లు 'సర్వవిధముల మే' లనుట వట్టి ముధావాదము. కనుపర్తికవియు, 'చతురకవిత్వతత్త్వపటుసంపద యొక్కరి సొమ్ము గా' దని పంతము పట్టి వ్రాసినాఁ డనిరుద్ధచరిత్ర. అదిగాక, వసుచరిత్ర కొక మానసపుత్రి యైన పురూరవశ్చరిత్రను 'గవిరాజమనోరంజనము'గా రచించిన జాణఁడతఁడు. కాని యొక్కమాట — నాయిక పేరఁ ప్రసిద్ధమైన కావ్యవస్తువును గ్రహించి, నాయకనామ ముంచుట యంత సమంజసము గాదు.

కురుగంటి వారు మరి యొక మాటయు ననియున్నారు. రంగాజమ్మ కృతి రాధికాసాంత్వనము (ముద్దుపళని కృతియని వారి యుద్దేశమనుకొందును) కంటె సహృదయహృదయాహ్లాదకరమై,సభ్యమై యొప్పారుచున్న'దని. అంతకంటె సభ్యమై యున్నదనుట కభ్యంతరము లేదు. విషయాంతరతరప్రత్యయమునకే విప్రతిపత్తి. ముద్దుపళని కవిత్వమున నెంత యెంగిలిపడినను రసికత్వమున రంగాజమ్మకుఁ దీసిపోదు. అస లిరువురు నొక్కకోవ లోని వారు - రసప్రసన్నకవనలు, రాజభోగైకజీవనలు.