పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

ఉషస్సుషమ

దిగినవి. అవి యెఱ్ఱన సోమనల హరివంశములు, పోతన భాగవతము. అందు సోమన యుషాపరిణయ ఘట్టముపైఁ బ్రత్యేకశ్రద్ధ చూపినాఁడు. అది రసబంధురమై ప్రబంధపాకమునఁ బడినది. పింగళి సూరనార్యుఁడును నుషాపరిణయగాథను మనస్సు నందుంచుకొనియే ప్రభావతీప్రద్యుమ్నమును రచించెనని యభియుక్తుల యభిప్రాయము, అదిగాక యాంధ్రమునఁ గేవల మా గాథ నితివృత్తముగా గ్రహించిన గ్రంథములు పదికిఁ బై గా నున్న యాధునిక నాటకములు గాక పూర్వకవులవే నాలుగు ప్రబంధములు, నొక ద్విపద, యక్షగానము లొక 'దస్కము' నగుపించుచున్నవి. అందు ప్రబంధములలోఁ జెప్పుకోదగినవి రంగాజమ్మ కృతియు, కనుపర్తి యబ్బయామాత్యుని యనిరుద్ధచరిత్రమును.

రంగాజమ్మ హరివంశకథానుసారముగ రచించెను. అబ్బయ భాగవతకథాసంవాదిగాఁ బ్రపంచించెను. రెండింటికిఁ గల భేద మిటఁ బ్రసక్తము. హరివంశమున నీ కథ విపులముగను, భాగవతమున సంగ్రహముగను గలదు. హరివంశమున నున్న శాంకరీవరప్రసక్తియు, ననిరుద్ధహరణోద్యోగమున నున్న చిత్ర రేఖ నారదునితో మంతన మాడుటయు భాగవతమున లేవు. ఉషాస్వప్న మన్నిట నున్నవిషయమే కాని యెఱ్ఱన హరివంశమున మాత్ర మనిరుద్ధుఁడు కూడ నుషవలెఁ గలఁ గాంచుట గలదు. రంగాజమ్మయు భాగ్యంతరమున నీ విషయము నుట్టంకించినది. హరివంశభాగవతములకుఁ గల యాయా భేదములే రంగాజమ్మ, అబ్బయల కృతులకును గలవు. కథైక్యఘటనమున రంగాజమ్మయుఁ, గవితాప్రౌఢియం దబ్బయయు నధికులు. అబ్బయ రంగాజమ్మ కర్వాచీనుఁడే కాని యా కాలమునఁ దక్కిన