పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉషస్సుషమ

vii

పద్యములలోఁ గలదు. గ్రంథారంభమునను గరుడస్తుతి గలదు. దానితోపాటు చెంగమలామన్నారుల, శేషవిష్వక్సేనుల, పన్నిద్దరాళ్వారుల, వేదాంత శ్రీనివాసదేశికుల ప్రశంసలును గలవు. మఱియు విజయరాఘవు నుద్దేశించి 'పరమతంబుల నెల్ల నిరసించి యే మేటి వైష్ణవమతమె శాశ్వతము జేసె' నని గలదు. నాయకరాజులకుఁ గులాచార రాజకీయవ్యవహారములతోపాటు వైష్ణవమును గర్ణాటప్రభువులనుండి వచ్చినదే. రంగాజమ్మ దెట్లును రాజుగారి మతమే.

మఱికొన్ని విశేషములు : గ్రంథము నందు సీసపద్యప్రాచుర్య మగుపించును. దక్షిణాంధ్రకవులకు సీస మన్న వల్లమాలిన మక్కువ[1]. 'అచ్చుత' శబ్ద మొకటి యిందుఁ బ్రాసఘటితముగాఁ బ్రయోగింపఁబడినది. అదియు నా కవుల కభిమతమైన యొక వైకృతరూపము[2]. బీగముద్రలు బిక్కుబీగములు, వద్దికి మొ॥ ప్రయోగములును గమనింపఁదగినవి.

ఆంధ్రవాఙ్మయమున నుషాపరిణయకథ ప్రచురప్రచారము గల కావ్యవస్తువులలో నొకటి. అట్లగుట కా కథయందు మధురోదాత్త రసరాజములగు శృంగారవీరములు రెంటికిని విశేషప్రసక్తి గల్గుటయే కారణము. ఆ కథకు సంస్కృతమూలములు హరివంశము, భాగవతము. అవియుఁ దెనుఁగునకు

  1. పద్యసంఖ్యను బట్టి శతకప్రాయ మైన సముఖము వేంకట కృష్ణప్పనాయకుని రాధికాసాంత్వనము పాతిక పద్యములు సీసములే.
  2. 2. ప్రాసఘటితముగనే “ఆచ్చుత" శబ్దమునకుఁ బ్రయోగాంతములు :
    అ. సముఖము రాధికాసాంత్వనము (ఆం. సా. ప. ప్రచురణ) - 8వ పద్యము
    ఆ. రఘునాథనాయకాభ్యుదయము (తంజావూరు సరస్వతీమహలు ప్రచురణ) లో నైదు పర్యాయములు ప్రాసఘటితముగానే ప్రయుక్తమైనది. శ్రీ మల్లంపల్లివారి పీఠికలో నవి యెత్తి చూపఁబడినవి.