పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉషస్సుషమ

v

నిరుద్ధుల సరసము రసోత్తరముగా సాగినది; అందు ప్రణయకలహఘట్టమే పదిపద్యములు పట్టినది. అనిరుద్ధుఁ డదృశ్యుఁ డైనప్పుడు రాణివాసమునఁ గలకలము పుట్టిన పట్టును రక్తి కట్టినది. యుద్ధఘట్టము నొక యాశ్వాసమున కాశ్వాస ముదాత్తముగా నడచినది. కొస కొఱవడినది గాని పరిణయఘట్టమును సరసముగా నడచియుండును. (రంగాజమ్మ పెండ్లిలో నాడుటయే గాని పెండ్లాడి యెఱుఁగక పోవచ్చును. కాని యామె కావ్యమునఁ బెండ్లిండ్లు వర్ణించుటయందు మిగుల నేర్పరి. ఆ విషయము మన్నారుదాసవిలాస నాటకమువలన ఋజువైనది). పలకబారిన పదబంధములతో హృదయ మూ కొట్టు భావవ్యక్తులతో నుషాపరిణయమున, ప్రత్యేకముగా నుదాహరింపఁ బని లేదు, పద్యము లెక్కడ పట్టినను మార్దవ ముట్టిపడుచుండును. ఆమె శయ్యాసౌభాగ్య మట్టిది. రంగాజమ్మ శృంగారరసాభిజ్ఞత యనుభవాత్మక మైనది. అసలు దక్షిణాంధ్రకవు లందఱు ననుభవసిద్ధు లైన రసికులు. ముందునాఁటి కవులందు శ్రీనాథ ధూర్జటి ప్రభృతులు కొద్దిమంది తప్పఁ దక్కిన కవుల శృంగారరసాభిజ్ఞత యుపజ్ఞామూలకమైన యూహాగానమే. ఇంకొక విశేషము — తంజావూరి కావ్యములలోఁ దఱచు సమకాలిక జాతీయజీవనప్రతిబింబనము గన్పట్టును. ఉషాపరిణయమునను నట్టి సందర్భములు గలవు. ఉదా:—

1. శ్రీకృష్ణుని కొలువుసింగారము, ననిరుద్ధుని యలంకరణము నాయకరాజుల నగరిముస్తీబుఁ దలపించుచున్నవి, నాఁడు మగవారికిని సిగలో సంపెగలు ముడుచుకొనుట యొక ముచ్చటయఁట!

వారి దుస్తులు : బురుసారుమాలు, బురుసాహిజారు, పసిఁడివ్రాఁత చెఱఁగుదట్టి, దుప్పటివలెవాటు మొ॥