పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

ఉషస్సుషమ

రంగాజమ్మ రచనలలోఁ గ్రమమును బట్టి యైదవ దైనను (మొదటి నాల్గు నందు పేర్కొనఁబడినవి) గవితాగౌరవమును బట్టి యుషాపరిణయమే ప్రథమగణ్య మైనది. మన్నారుదాసవిలాసనాటకమును యక్షగానవాఙ్మయమున మిగుల విశిష్టమైనదే. విజయరాఘవున కతిప్రియమైన సాహిత్యప్రక్రియ యక్షగానమగుటచే నాఁడు ప్రబంధరచన వెనుకఁబడినది[1]. మన కిపుడు లభించు ప్రబంధము లతని నాఁటివి మూఁడే — చెంగల్వకాళకవి రాజగోపాలవిలాస మొకటి, రంగాజమ్మవి రెండు. ఆ కొలఁదిపాటి ప్రబంధములలో రంగాజమ్మ యుషాపరిణయ మొక నిక్కంపు మంచి నీలమని చెప్పవచ్చును. కథావస్తువు, యథాప్రాబంధికమైన వర్ణనాఫక్కికయుఁ బరిచితపూర్వము లనుట తప్ప తత్సంవిధానమునఁ గాని రచనావైచిత్రియందు కాని యామె యొకరి ననుకరింపలేదు; ఆమె నొక రనుకరింపలేదు.

ఆమె కవితా చాతుర్యమునకు నికషప్రాయములగు కొన్ని సందర్భముములు: కలవలని కలవరమునఁ జెలులచే శైత్యోపచారములు స్వీకరించుచున్న యుష యొకపరి కలఁ గలసినవాఁడు కట్టెదుటఁ గనఁబడినట్లు భ్రమపడును. ఆ భ్రమ ద్వితీయాశ్వాసమున సుదీర్ఘముగా నాఱు సీసములలోఁ జెప్పబడినది. చిత్రపటములో నుష కనిరుద్దుఁడు చిక్కినాఁడు. కాని చిత్రరేఖ యామె 'మనం బరయుటకై ' అబ్బో దవ్వులనున్న ద్వారకనుండి యనిరుద్ధునిఁ దెచ్చుట నావల్ల కాదనును; ఉష యుస్సు రనును. ఆ భ్రమలో నా యసురుసురులో భావోద్విగ్నమై యుషారమణి ముగ్ధత్వము మూర్తికట్టినది. ఉషా

  1. ప్రబంధములును, యక్షగానములుగాఁ బరివర్తింపఁ బడినవి నాఁడు. రంగాజమ్మ మన్నారుదాసవిలాసము, విజయరాఘవుని రఘునాథనాయకాభ్యుదయము నట్టివే.