పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉషస్సుషమ

iii

డప్పుడే తంజావూరి తాఁటితోఁపు దాటి వచ్చునట్లు లేదు. ఆ రెంటికి నడుమ రచింపఁబడిన యుషాపరిణయ మిదిగో యిన్నాళ్ళ కచ్చుమొగము జూడ నోచుకొన్నది. అదియు గ్రంథము సమగ్రముగా లభింపలేదు. కాని కథ తుదముట్ట వచ్చినది; అట్టే లోపించి యుండదు, అసమగ్ర మని ముద్రింపక యుపేక్షించినచో నున్నదియు నుత్సన్నము కావచ్చును. అదియుఁగాక మనకున్న కవయిత్రుల కృతులే తక్కువాయె. అందును రంగాజికృతులందు నాయకరాజులకు సంబంధించిన చారిత్రకాంశములు గలవు. అందుచే మన్నారుదాసవిలాస ప్రబంధమును వెంటనే ప్రకటింపఁదగినది.

ఉషాపరిణయ రచనాకాలనిర్ణయమున కూహము వినా మఱి యుపాయము లేదు. మన్నారుదాసవిలాసనాటకమే రంగాజమ్మ చరమరచన. అందుఁ బై కృతు లన్నియుఁ బేర్కొనఁబడినవి. ఆ నాటకరచనా కాలమును గచ్చితముగాఁ జెప్పఁబడలేదు. కాని యేదే నొక కథాసందర్భమును బురస్కరించుకొని యే వివాహాదికసంకల్పపరముగనో, యనఁగాఁ బరోక్షపద్ధతిని, రచనాకాలమును సూచించుటయు నొక శిల్పవిన్యాసమే గనుక నాఁటి కవు లా పరిపాటిఁ బాటించిరి. రంగాజమ్మయు రాజగోపాలస్వామి ఫాల్గునోత్సవ శ్రీ ముఖమున (నాయకరాజులు తమ యిలువేల్పగు రాజమన్నారునకు 'పంగుని తిరునాళ్లు' జరిపించుట యాచారమై యుండెడిది) 'శుభకృ'త్సంవత్సరమును బేర్కొన్నది. అది విజయరాఘవుని రాజ్యపాలనకాలమున, క్రీ. శ. 1664 వ సం॥గా గుర్తింపఁబడినది. అదే మన్నారుదాసవిలాస నాటకరచనాకాలము గావచ్చును. ఉషాపరిణయము తత్పూర్వరచన కావున, క్రీ. శ. 1664 నకు ముందే రచింపఁబడియుండు ననిమాత్రము చెప్పవచ్చును.