పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii

ఉషస్సుషమ

ఇఁక రంగాజిచరిత్ర రసికుల కొక ముచ్చట. ఆమె తండ్రి వేంకటాద్రి; తల్లి మంగమాంబ. ఇష్టదైవతము రాజగోపాలుఁడు, 'ఉరఫు' రాజమన్నారు. ఆ మన్నారుదాసుఁడు విజయరాఘవభూపాలుఁ డసలు తన పతి యనియే రంగాజమ్మ బడాయి కొట్టుకొన్నది గాని యది వట్టి మాటవరుస. ఆతఁ డామె కభీష్టకృతిపతి. అతని యాస్థానమున నామెకు పట్టమహిషులకును బట్టని యోగము పట్టినది. అది యొక గాథ. పత్రికాలేఖనము నందు, పదకవిత్వమునందు, రాజనీతియందు, బహుభాషావైదుషియందు నందెవేసిన చేయి యామెది. రంగాజి రాజసభలో నెప్పుడైన గజ్జె కట్టినదో లేదో గాని యభినయసంగీతాదికళామర్మములు నామె క చుంబితములు గావు. వెన్నతోఁ బెట్టిన విద్యలు సరేసరి. మన్నారుదాసవిలాసనాటకమున సాగిన శాస్త్రప్రసంగములనుబట్టి యామె వ్యాకరణజ్యోతిశ్శాస్త్రవిత్త్వమును విశద మైనది. ఇన్నిమాట లెందుకు — ఆమె విద్యల గజ్జెలగుఱ్ఱము, కళల కాణాచి. ఆమెయు నా దక్షిణాధీశు[1] ముత్యాలశాల దీనారటంకాలఁ దీర్థ మాడించినది. ఇతర పూర్వాంధ్రకవయిత్రు లెవ్వరు నింత పాండిత్యము గలవారు కారు; ఇన్ని కృతులు రచించినవారును గారు.

ఆమె కృతులు గ్రంథాంతగద్యలను బట్టి మన కెఱుక పడినవి యాఱు. అవి రామాయణ భారతభాగవతకథాసంగ్రహములు, మన్నారుదాసవిలాసము పేరిట నొక ప్రబంధము, నొకయక్షగాననాటకము, నీ యుషాపరిణయము. అందు మొదటి మూఁడు నిపు డుపలబ్థములు గావు. మన్నారుదాసవిలాస నాటక మాంధ్రసాహిత్యపరిషత్తుచేఁ బ్రచురింపఁబడినది. అంతకు ముందే రచింపఁబడినను నా పేరిటి ప్రబంధ మిప్పు

  1. మ. దా. వి. నాటకము 49 వ పుటలో విజయరాఘవపరముగ 'దక్షిణరాయ'యను సంబుద్ధి గలదు.